అయ్యో.. ఏపీ: ఆదాయమంతా జీతాలకే చాలట్లేదట?

ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడ నుంచి వస్తుంది. ప్రజలు కట్టే పన్నుల నుంచి.. ప్రజలు చేసే వ్యాపారాల నుంచి.. ప్రజలు వినియోగించే వస్తువుల నుంచి.. ప్రజలు చేసే ఖర్చుల నుంచి.. ఇలా అనేక మార్గాల్లో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దీన్నే ప్రభుత్వం మళ్లీ ప్రజలకు అనేక రూపాలుగా ఖర్చు చేస్తుంది. అయితే.. ఆదాయం ఎక్కువగా ఉండి.. ఖర్చు తక్కువగా ఉంటే.. ఆ మిగులుతో ప్రభుత్వం ఏదైనా అభివృద్ధి పనులకు వినియోగించే అవకాశం ఉంటుంది. కానీ.. ఏపీ పరిస్థితి అలా ఏమాత్రం లేదట.

అసలు ఏపీకి అన్ని మార్గాల్లో వచ్చే ఆదాయం అంటే.. ప్రత్యక్ష పన్నుల ద్వారా.. పరోక్ష పన్నుల ద్వారా.. ఇతర మార్గాల ద్వారా... అన్ని మార్గాల ద్వారా వచ్చే ఆదాయం మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకే సరిపోవడం లేదట. ఈ విషయం ఎవరో ప్రతిపక్షం వాళ్లు చెప్పింది కాదు.. అక్షరాలా ముఖ్యమంత్రి సలహాదారు అజేయ కల్లం చెప్పిన మాట. అందులోనూ ఈ ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం ప్రజల్లో కేవలం 3 శాతం మాత్రమే ఉన్నారని.. వీరి కోసం రాష్ట్రం మొత్తం ఆదాయం వెచ్చిస్తున్నామని అర్థం వచ్చేలా అజేయ కల్లం మాట్లాడారు.

మరి ఎందుకు ఈ దుస్థితి వస్తోంది.. ఏపీకి ఆదాయ మార్గాలు లేవా.. ఉన్న ఆదాయ మార్గాలను సరిగ్గా వినియోగించుకోవడంలేదా.. అంటే.. దానికి కూడా ప్రభుత్వ సలహాదారు ఓ సూచన ఇచ్చారు. పన్ను వసూళ్లలో లీకేజీలను అరికడితే ఆదాయం పెంచుకోవచ్చట. ఈ దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందట.. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఏపీ వాణిజ్య పన్నుల శాఖ అసోసియేషన్ స్వర్ణోత్సవ సభలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది.

ఈ సభకు నలుగురు రాష్ట్ర మంత్రులు వచ్చారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి , బొత్స సత్యనారాయణ, పేర్నినాని, వెల్లంపల్లి శ్రీనివాస్... వీరితో పాటు వచ్చిన ప్రభుత్వ సలహాదారులు అజయ్ కల్లం..  రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఈ వ్యాఖ్యలు చేశారు. మరి ఈ పరిస్థితిని జగన్ ఎలా చక్కదిద్దుతారో.. సంక్షేమ కార్యక్రమాలు ఆపకుండా ఎలా జాగ్రత్తలు తీసుకుంటారో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: