జగన్ కేబినెట్‌.. అందరినీ పీకేస్తారా?

ఏపీ సీఎం జగన్ తన కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరణ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆయన అసలు మొదట్లో మంత్రి వర్గం ఏర్పాటు చేసేటప్పుడే రెండున్నరేళ్ల వరకే మీ పదవులు అని స్పష్టంగానే చెప్పేశారు. కానీ అది అమలు చేయడంలో కాస్త ఆలస్యమైంది. అయితే.. జగన్ కేబినెట్ విషయంలో మొదటి నుంచి అనేక ఊహాగానాలు సాగుతున్నాయి. మొత్తం కేబినెట్‌ ను పీకేయరని.. కొందరు ముఖ్యులను కొనసాగిస్తారని ప్రచారం సాగింది.

బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేశ్ వంటి వారిని కొత్త కేబినెట్‌లోనూ కొనసాగిస్తారని ప్రచారం జరగుతోంది. అయితే.. తాజాగా వినిపిస్తున్నదేమిటంటే.. జగన్ మొత్తాన్నీ తీసేస్తారట. ఏ కొందరిని కొనసాగించినా మళ్లీ అందరూ తమనూ కొనసాగించమని ఒత్తిడి చేసే అవకాశం ఉందని.. జగన్ భావిస్తున్నటు తాజా సమాచారం.. అసలే ఎన్నికలు ఇంకా రెండు ఏళ్లు మాత్రమే ఉంటాయి. ఇలాంటి సమయంలో మంత్రి పదవుల కోసం విబేధాలు రావడం మంచిది కాదని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తంది.

జగన్ ముందుగానే చెప్పినట్టు మొత్తం మంత్రి వర్గాన్ని తీసేసి.. అంతా కొత్త వాళ్లనే తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదని.. అందరికీ ముందుగానే చెప్పినందువల్ల అర్థం చేసుకుని సహకరిస్తారని జగన్ భావిస్తున్నారట. తీసేసిన మంత్రులను జిల్లా పార్టీ అధ్యక్షులను చేస్తే.. వారు ఎన్నికల్లో బాగా పని చేస్తే.. మళ్లీ మంత్రి పదవులు ఇస్తానని హామీ ఇస్తారని తెలుస్తోంది.

మంత్రి వర్గం అంటే అనేక సామాజిక సమీకరణలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. కొందరిని కొనసాగిస్తే.. ఆ కొనసాగించిన వారి సామాజిక వర్గం కూడా చర్చనీయాంశం అవుతుంది. ఆ కులాల్లోని ఆశావహులు కూడా నిరాశ పడతారు. అందుకే ఈ గొడవ అంతా ఎందుకొచ్చిన గొడవ.. మొత్తాన్నీ పీకి పారేసి.. అంతా కొత్త వాళ్లను తీసుకుంటే ఏ గొడవా ఉండదని జగన్ భావిస్తున్నారట. చూడాలి మరి జగన్ ఏం చేస్తారో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: