సొంత పార్టీ నేత‌ల‌నే టార్గెట్ చేసిన రేవంత్‌... మామూలుగా కాదే...!

VUYYURU SUBHASH
వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ కావాలంటే పార్టీ కోసం క‌ష్ట‌ప‌డాల్సిందేన‌ని.. పోటీకి ఆస‌క్తి చూపే నేతలంద‌రూ పార్టీ స‌భ్య‌త్వ న‌మోదును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవాల్సిందేన‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ తేల్చి చెప్పారు. నిర్ల‌క్ష్యం వ‌హించే నేత‌ల‌ను పోటీకి దూరం పెడ‌తాన‌ని హెచ్చ‌రించారు. దీనిపై పార్టీలో ర‌క‌ర‌కాలుగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. రేవంత్ ప‌రోక్షంగా సీనియ‌ర్ నేత‌ల‌నే టార్గెట్ చేసుకొని మాట్లాడిన‌ట్లు స్ప‌ష్టంగా తెలుస్తోంది.

పార్టీ స‌భ్య‌త్వ న‌మోదుపై రేవంత్ వ‌రుస స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. డిజిట‌ల్ స‌భ్య‌త్వ న‌మోదును అధిష్ఠానం సీరియ‌స్ గా తీసుకుంద‌ని.. ప్ర‌తి రోజూ ప‌ర్య‌వేక్షిస్తోంద‌ని.. నిర్ల‌క్ష్యం చేసే నేత‌ల‌ను కొన‌సాగించ‌వ‌ద్ద‌ని చెప్పింద‌ని నేత‌లు అంటున్నారు. ప్ర‌తి బూత్ లో 100 స‌భ్య‌త్వాలు త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని సూచించింద‌ట‌. స‌భ్య‌త్వ న‌మోదులో బాగా ప‌ని చేసిన వారికే పార్టీలో భ‌విష్య‌త్ ఉంటుంద‌ని.. ప‌ని చేయ‌నివారికి ప‌ద‌వులు క‌ష్ట‌మ‌ని రేవంత్ చెప్పారు.

దేశ‌వ్యాప్తంగా 542 పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాలు ఉంటే అగ్ర‌స్థానంలో న‌ల్ల‌గొండ నిలిచింద‌ని రేవంత్ చెప్పారు. సీనియ‌ర్లు ఉత్త‌మ్‌, జానా రెడ్డి అద్భుతంగా ప‌ని చేసి 3.50 ల‌క్ష‌ల స‌భ్య‌త్వాల‌ను చేయించార‌ని కొనియాడారు. అయితే, ఉమ్మ‌డి మెద‌క్ జిల్లా  నేత‌ల‌తో జ‌రిగిన స‌మావేశంలో రేవంత్ సీరియ‌స్ అయ్యార‌ట‌. ప్ర‌తీ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో 50 వేలు స‌భ్య‌త్వాలు న‌మోదు చేయాల‌ని రేవంత్ టార్గెట్ విధించార‌ట‌.

అయితే.. అత్య‌ధికంగా నారాయ‌ణ‌ఖేడ్ లో 35 వేలు పూర్త‌యితే.. అత్య‌ల్పంగా పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న సంగా రెడ్డిలో కేవ‌లం 2 వేలే అయ్యాయ‌ట‌. పార్టీ మ‌రో సీనియ‌ర్ నేత దామోద‌ర రాజ‌న‌ర్సింహ నియోజ‌క‌వ‌ర్గం అందోలులో 7 వేలు మాత్ర‌మే స‌భ్య‌త్వాలు న‌మోదు అయ్యాయ‌ట‌. గీతా రెడ్డి స్థాన‌మైన జ‌హీరాబాద్ లో 27 వేలు.., మెద‌క్ లో 20 వేలు.., గ‌జ్వేల్ లో 18 వేలు.., న‌ర్సాపూర్ లో 18 వేలు.., ప‌టాన్ చెరులో 17 వేలు.., దుబ్బాక‌లో 8 వేలు.., సిద్దిపేట‌లో కేవ‌లం 4 వేలు మాత్ర‌మే పూర్త‌య్యాయ‌ట‌.

ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలో సంగారెడ్డి, అందోలు, దుబ్బాక‌, సిద్దిపేట లో అత్య‌ల్పంగా న‌మోదు కావ‌డంపై రేవంత్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ట‌. పార్టీ సీనియ‌ర్ నేత‌ల నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌భ్య‌త్వాల‌పై ప‌ట్టించుకోక‌పోవ‌డంపై అసంతృప్తిగా ఉన్నార‌ట‌. ముఖ్యంగా జ‌గ్గా రెడ్డి, రాజ‌న‌ర్సింహ ల‌ను ప‌రోక్షంగా హెచ్చ‌రించార‌ట‌. ఇప్ప‌టికైనా సీనియ‌ర్లు మేల్కొని ప‌ని చేస్తారా.. లేదంటే పార్టీ చ‌ర్య‌ల‌కు బాధ్యుల‌వుతారా అనేది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: