జగన్‌కు కొండంత మేలు చేస్తున్న రఘురామ?

ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. ఏపీ రాజకీయాల్లో ఇదో విచిత్రమైన క్యారెక్టరు.. ఆయన సొంత పార్టీపైనే నిత్యం దుమ్మెత్తిపోస్తుంటారు. మా ముఖ్యమంత్రి.. మా ప్రభుత్వం అంటూ వెటకారంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటారు. ఇక ఈయన మీడియా సమావేశాల ఓ రికార్డు అని చెప్పుకోవాలి. బహుశా ప్రతిపక్షంలోని చంద్రబాబు కూడా అన్నిసార్లు జగన్‌ ను విమర్శిస్తూ ప్రెస్‌ మీట్‌ పెట్టారో లేదో కూడా అనుమానమే. ఎంపీ రఘురామ కృష్ణంరాజు మాత్రం గ్యాప్ లేకుండా రెండు,మూడు రోజులకు ఓసారి వైసీపీ సర్కారుపై విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు.

అందుకే ఎంపీ రఘురామ కృష్ణంరాజు అంటే.. వైసీపీ నేతలకు కడుపు మండుతుంటుంది. అందుకే అతనిపై అనర్హత వేటు వేయాలని ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. అనర్హత ఎందుకు నేనే రాజీనామా చేసేస్తా అంటున్నారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఇవన్నీ చూస్తే ఎంపీ రఘురామ కృష్ణంరాజు జగన్‌కు చేటు చేస్తున్నట్టు కనిపిస్తుంది.. కానీ.. ఏపీ రాజకీయాల్లో జగన్‌కు అత్యంత మేలు చేస్తున్న వ్యక్తిగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు పేరు చెప్పుకోవచ్చు.

ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఏ తప్పునూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వదిలిపెట్టరు. ఇలా ప్రభుత్వాన్ని నిత్యం విమర్శించే మెకానిజం అవసరం. అది ప్రతిపక్షం కాకుండా స్వపక్షం అయిఉంటే ఇంకా మంచిది. ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శలపై జగన్‌ సీరియస్‌ దృష్టి సారించి.. వాటిలో నిజానిజాలు ఉంటే.. తగిన నివారణ చర్యలు తీసుకుంటే.. ప్రజాగ్రహం, ప్రజావ్యతిరేకత నుంచి సులభంగా తప్పించుకోవచ్చు. ఇంకా సులభంగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే.. ప్రెషర్‌ కుక్కర్‌లో వచ్చే విజిల్‌ లాంటి వాడు ఎంపీ రఘురామ కృష్ణంరాజు.

ఈ ప్రెషర్‌ కుక్కర్‌ నుంచి వచ్చే విజిల్‌ను బట్టి అప్రమత్తమై లోపాలు సరి చేసుకుంటే మంచిదే.. అలా కాదు.. ఏంటీ విజిల్ గోల అనుకుంటే మాత్రం అది జగన్‌కు అంతిమంగా చేటే చేస్తుంది. విమర్శలను స్వాగతించడం.. లోపాలు సరిదిద్దుకోవడం ఎప్పుడూ అవసరమే. అది కూడా ఏకంగా నిరాటంకంగా 30 ఏళ్లు పాలించాలన్న కోరికతో అధికారం చేపట్టిన జగన్‌కు ఆ సహనం, విశ్లేషణ అత్యవసరం. ఆ రకంగా విమర్శల ద్వారా రఘురామ జగన్‌కు ఎనలేని మేలు చేస్తున్నాడని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: