రాఘురామ వాట్సాప్ ఛాట్ : జగన్ ఓటమేనా?

నాలుగేళ్ల క్రితం అనుకుంట... ఒక ఉగ్రవాది  అమెరికాలో కాల్పులు జరిపి 14 మందిని కాల్చి చంపితే, ఆ ఉగ్రవాది ఐఫోన్ ని స్వాధీనం చేసుకున్న  అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్ బి ఐ...  దాన్ని అన్ లాక్ చేయడానికి చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. దాదాపుగా 10 సార్లు ప్రయత్నాలు చేసి చేసీ చివరికి యాపిల్ సంస్థను అడిగితే యాపిల్ చెప్పిన సమాధానం విని దర్యాప్తు సంస్థ అధికారులు షాక్ అయ్యారు. యూజర్ల డేటాకు మేము అధిక ప్రాధాన్యత ఇస్తాము... మేము ఓపెన్ చేయలేమని చెప్పింది.


ఆ తర్వాత ఫెడరల్ న్యాయస్థానానికి కూడా వెళ్ళగా అక్కడి న్యాయమూర్తి ఆదేశించినా సరే యాపిల్ ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఇజ్రాయిల్ కి చెందిన ఒక సంస్థ సహకారంతో ఐఫోన్ ని అధికారులు అన్ లాక్ చేసారు. ఇది అంతర్జాతీయంగా కూడా వివాదాస్పదం అయింది. ఆ తర్వాత అమెరికాలో జరిగిన పలు కాల్పుల ఘటనలకు సంబంధించి, ఐఫోన్ లను ఓపెన్ చేయకపోవడానికి యాపిల్ అంగీకరించకపోవడంతో అధికారులు అదే విధానం అవలంభించారు. కాని దాన్ని బహిరంగంగా తాము అన్ లాక్ చేసామని ప్రపంచానికి చెప్పారు.


ఇప్పుడు ఇదంతా ఎందుకూ అంటే... ఏపీలో ఒక ఐఫోన్ అన్ లాక్ అయింది. ఏ కోర్ట్ కి వెళ్ళకుండా, మీడియాలో వార్తలు రాకుండా అది అన్ లాక్ అయింది. ఎవరిదీ ఏంటీ అంటే... నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణం రాజు ఫోన్. ఆయనను సిఐడీ అధికారులు అదుపులోకి తీసుకుని, ఫోన్ స్వాధీనం చేసుకుని, రాజద్రోహానికి సంబంధించి అనేక ప్రశ్నలు వేసి చివరికి ఫోన్ ఇవ్వకుండా ఆయనను ఏపీ నుంచి సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వరకు బాగానే ఉంది గానీ... ఐఫోన్ విషయంలో జరిగినవే కాస్త వివాదాస్పదంగా ఉన్నాయనేది టెక్ నిపుణుల మాట.


మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ కు రఘురామ కృష్ణం రాజు ఫోన్ నెంబర్ నుంచి మెసేజ్ లు వెళ్ళాయి. ఆ మెసేజ్ లకు సంబంధించి పీవీ రమేష్ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసారు. అప్పుడు రఘురామ కూడా తన ఐఫోన్ ని సిఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెప్తూ, తాను సిమ్ కార్డు మార్చేసాను, తనకు సంబంధం లేదని ఒక వివరణ ఇచ్చారు. తన ఫోన్ పాస్వార్డ్ కూడా అధికారులకు చెప్పలేదనీ అన్నారు. తనను కొట్టి గుండెల మీద కూర్చుని పాస్వార్డ్ అడిగినా సరే చెప్పలేదని వివరణ ఇచ్చారు. 


ఆ తర్వాత కొన్ని లేఖలు రాసారు. సిఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ కు ఆయన ఒక హెచ్చరిక కూడా చేసారు. తన ఫోన్ ఇవ్వకపోతే తాను లీగల్ చర్యలకు దిగుతానని... అలాగే తన కుటుంబ సభ్యులు, పార్లమెంటరీ వ్యవహారాల కమిటీకి సంబంధించిన సమాచారమూ అందులో ఉందని చెప్పారు. ఆ తర్వాత సిఐడీ అధికారులు స్పందిస్తూ ఐఫోన్ నుంచి ఎవరికి మెసేజ్ లు వెళ్ళలేదు అంటూ సమాధానం ఇచ్చారు. అది అక్కడితో ఆగింది గానీ... ఇప్పుడు ఒక విషయం బయటకు వచ్చింది.  రఘురామ, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాట్లాడుకున్న చాట్ బయటకు వచ్చింది.


ఆ చాట్ కూడా వాట్సాప్ చాట్. ఏపీ అధికార పార్టీకి చెందిన అధికార పత్రిక దీన్ని బయట పెట్టింది. వాట్సాప్ చాట్ అనేది చాలా సున్నితమైన అంశం. సిఐడీ ఓపెన్ చేసినా, సిబిఐ ఓపెన్ చేసినా సరే అది ప్రజలకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో చెప్పాల్సిన వ్యవహారం. చంద్రబాబు, రఘురామ ఏం మాట్లాడుకున్నారో క్లియర్ గా రాసి కథనం ప్రచురించారు. వాట్సాప్ చాట్ ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది. అంటే పంపిన వారికి చదివే వారికి మాత్రమే తెలుస్తుంది. కాని రఘురామ విషయంలో అలా జరగలేదు. సిఐడీ అధికారుల దర్యాప్తులో తెలిసిందని చాట్ బయటపెట్టారు.


ఐఫోన్ అన్ లాక్ చేస్తే యాపిల్ కు సమాచారం ఇచ్చారా...? కోర్ట్ కి చెప్పారా...? వాట్సాప్ చాట్ ని బయటకు తీస్తే యాజమాన్యానికి సమాచారం ఇచ్చారా అనేదే ప్రధాన అంశం. ఈ విషయంలో సుప్రీం కోర్ట్ కి లేదా హైకోర్ట్ రఘురామ గాని చంద్రబాబు గాని వెళ్తే, కోర్ట్ లు పౌరుల భద్రతకు సంబంధించి సదరు యజమాన్యాలకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉండొచ్చు. ఫలితంగా ఏపీ ప్రభుత్వంపై యాపిల్ లేదా వాట్సాప్ రెండూ కూడా దావా వేసే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఇది అంతర్జాతీయ స్థాయిలో ఇష్యూ అయినా సరే ఏపీ ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కోవచ్చనే మాట వినపడుతుంది.


ఆ పత్రిక కథనంతో రఘురామ లేదా చంద్రబాబు చర్యలకు దిగితే ఇది దేశ వ్యాప్త సంచలనంగా మారే అవకాశం ఉండొచ్చు, ఏపీలో పౌరుల సమాచారానికి భద్రత లేదనే అంశం హైలెట్ కావొచ్చు. ఓటుకి నోటు విషయంలో చంద్రబాబుని కేసీఆర్ పట్టుకున్నారని చెప్పినా ఒక సిఎం ఫోన్ ట్యాప్ ఎలా చేస్తారని చంద్రబాబు ఇష్యూ రైజ్ చేస్తే తెలంగాణా సైలెంట్ అయిందని కొందరు అంటూ ఉంటారు. ఇప్పుడు రఘురామ విషయంలో పట్టుని అధికారులే చేజార్చుకున్నారు, కొత్త సమస్యలను తెచ్చుకున్నారనే వాదన వినపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: