కాంగ్రెస్ లో ఇంటిదొంగలు.. బాబోరి రేవంత్ టార్గెట్ ఎవరు..?

Deekshitha Reddy
తెలంగాణ కాంగ్రెస్ లో బాబోరి రేవంత్ హడావిడి మామూలుగా లేదు. హుజూరాబాద్ లో కౌశిక్ రెడ్డి షాకివ్వడంతో ఆయనకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంటిదొంగలు అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం రేపాయి. పెట్రోలు ధరల పెంపుకి నిరసనగా చేపట్టిన ర్యాలీలో బీజేపీపై విమర్శలు చేయాల్సింది పోయి, సొంత పార్టీ నేతల్ని టార్గెట్ చేయడం ఏంటని చాలామంది రేవంత్ తీరుని బహిరంగంగానే విమర్శించారు.
బాబోరి రేవంత్ ఏమన్నారు..?
"నేను జానారెడ్డి అంత సీనియర్ ని కాదు, అంత మంచివాడినీ కాదు, కాంగ్రెస్ పార్టీలో ఇంటి దొంగల్ని నేను వదిలిపెట్టను" అంటూ రెచ్చిపోయారు రేవంత్ రెడ్డి. కష్టపడి పనిచేసేవారిని వదిలిపెట్టనంటూనే, కాంగ్రెస్ కి నష్టం కలిగించేవారు నెలరోజుల్లో పార్టీని వదిలిపెట్టి వెళ్లాలని హితవు పలికారు. లేకపోతే తరిమి తరిమి కొడతామన్నారు. రేవంత్ వ్యాఖ్యలతో చాలామంది సీనియర్లు నొచ్చుకున్నారు. కాంగ్రెస్ లో ఇంటిదొంగలు ఉన్నారనడం సబబు కాదని, టీడీపీనుంచి వచ్చి చేరిన రేవంత్ ఆ వ్యాఖ్యలు చేయడం అస్సలు కరెక్ట్ కాదని అంటున్నారు.
ఇంతకీ రేవంత్ టార్గెట్ ఎవరు..?
తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డికి చాలామందితోనే విభేదాలున్నాయి. టీపీసీసీ అధ్యక్ష ఎన్నికల వేళ అవి బయటపడ్డాయి కూడా. ఆ తర్వాత కూడా అసంతృప్తి జ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఎక్కడో ఓ చోట, ఎవరో ఒకరు రేవంత్ రెడ్డి టీపీసీసీ పీఠంపై వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అయితే అలాంటి వారందర్నీ ఒకే గాటన కట్టి ఇంటి దొంగలు అనేశారు రేవంత్ రెడ్డి. అయితే తెలంగాణ కాంగ్రెస్ లో వైఎస్సార్ అభిమానులే రేవంత్ రెడ్డి టార్గెట్ అని అంటున్నారు కొంతమంది. వైఎస్ఆర్ అనుచరులు, అభిమానుల్ని సాగనంపితే టీపీసీసీపై తన పట్టు నిలుపుకోవచ్చనేది ఆయన ఆలోచన. తనని టీడీపీ వలసవాది అనే అసలు సిసలు కాంగ్రెస్ వాదులెవరూ రేవంత్ కి నచ్చడంలేదు. దీంతో ఆయన కొంతమందిని కావాలనే టార్గెట్ చేస్తున్నారట. ఇంటిదొంగలు అని అవమానిస్తూ పార్టీనుంచి సాగనంపాలనుకుంటున్నారట. ఇలా రేవంత్ హిట్ లిస్ట్ లో ఉన్నవారంతా వైఎస్ఆర్ అనుచరులే కావడం విశేషం. మరి వీదంర్నీ బయటకు పంపి.. బాబోరి రేవంత్ టీపీసీసీని టీడీపీ నేతలతో నింపేస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: