హెరాల్డ్ ఎడిటోరియల్ : గ్లోబల్ టెండర్లు పిలిచేస్తే సమస్య వర్కవుటవుతుందా ?

Vijaya
అవసరమైన టీకాల కోసం ఏపి ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను పిలిచింది. నిజానికి విదేశీకంపెనీలతో ఒప్పందాలంటే గ్లోబల్ టెండర్లు పిలిచినంత సులభంకాదు. అందులోను కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కబళించేస్తున్న కాలంలో టీకాల ఉత్పత్తి, సరఫరాకు విదేశీకంపెనీలు చాలా జాగ్రత్తలు తీసుకుంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సరే ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను పిలిచింది విదేశీకంపెనీలు స్పందించేందుకు మూడువారాల గడువు కూడా ఇచ్చింది. కాబట్టి చివరకు ఏమి జరుగుతుందో తెలియాలంటే అంతవరకు వెయిట్ చేయాల్సిందే. అయితే ఈలోగా జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది చాలానే ఉంది. గ్లోబల్ టెండర్లను నమ్ముకుని కూర్చుంటే సమస్య పరిష్కారం అవ్వదు. అందుకనే ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్రమోడిని కలవాలి. బతిమలాడుకోవటమో లేకపోతే ఒత్తిడి పెట్టడమో చేసి అవసరమైన టీకాల కోసం ప్రయత్నించాల్సిందే.



టీకాలు సరిపడా కావాలని, ఆక్సిజన్ సరఫరా పెంచాలని నరేంద్రమోడికి జగన్ లేఖరాశారు. అయితే కేంద్రం ఏపి కోరినట్లు టీకాలు, ఆక్సిజన్ పంపుతోందా ? పంపటం లేదన్న విషయం క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అర్ధమైపోతోంది. ఆక్సిజన్ అయినా టీకాలైనా ఏపి అవసరాలకు తగ్గట్లుగా కేంద్రం పంపటం లేదుకాబట్టి డిమాండ్ బాగా పెరిగిపోతోంది. ఇదే సమయంలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం వల్ల అక్కడక్కడ కొన్ని ఆసుపత్రుల్లో రోగులు చనిపోతున్నారు. తాజాగా తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో 11 మంది చనిపోయిన విషయం తెలిసిందే.



అడిగినన్ని టీకాలు పంపటం లేదని, ఆక్సిజన్ సరఫరా పెంచటం లేదని కేంద్రంపై నెపం వేసేస్తే సరిపోతుందా ? అవసరమైనవి పంపని కేంద్రాన్ని ఎలా దారికి తీసుకురావాలో చూసుకోవాల్సిన బాధ్యత జగన్ పైనే ఉంది. జనాలకు కావాల్సిందల్లా వేసుకోవటానికి సరిపడా టీకాలు, రోగులకు ఆక్సిజన్ సరఫరా అంతే. ఇపుడు దేశమంతా ఉన్నట్లే ఏపిలో కూడా టీకాల కొరత, ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ఈ పరిస్ధితుల్లో ఆక్సిజన్ కొరతను తీర్చటానికి ఇతర రాష్ట్రాలతోనో లేకపోతే విదేశాలతోనో రాష్ట్రప్రభుత్వం మాట్లాడుకుని సర్దుబాటు చేసుకోవాల్సిందే.



అలాగే టీకాల కోసం కూడా కేంద్రంతో గట్టిగా మాట్లాడాల్సిందే. టీకాలు, ఆక్పిజన్ కొరతపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శల్లో కాస్త వాస్తవం ఉన్నది. అయితే జగన్ పై మంటతో చంద్రబాబు, లోకేష్ అండ్ కో సమస్యను మరీ ఎక్కువగా చెబుతున్న విషయం కూడా నిజమే. ప్రతిపక్షాలను లేకపోతే ఎల్లోమీడియా గురించి జగన్ ఆలోచించాల్సిన అవసరం లేదు. జగన్ ఆలోచించాల్సిందంతా తనను నమ్మి 151 అసెంబ్లీ, 22 ఎంపి సీట్లను ఇచ్చిన జనాలను మాత్రమే. ఇఫ్పటికే జరగాల్సినంత నష్టం జరిగిపోయింది. భవిష్యత్తులో మరింత నష్టం జరగకూడదంటే టీకాలు, ఆక్సిజన్ విషయంలో కేంద్రానికి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిందే వేరే దారిలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: