బీజేపీ అనుగ్ర‌హం కోసం జ‌గ‌న్ పాట్లు.. అందుకేనా ఈ ట్వీట్లు!

Thanniru harish
ప్ర‌ధాని మోదీ అనుగ్ర‌హం కోసం ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పాట్లు ప‌డుతున్నాడా? అందులో భాగంగానే అవ‌స‌రం లేకున్నా, సొంత బీజేపీ నేత‌లే ప‌ట్టించుకోని విష‌యానికి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి స్పందించి మోదీ మ‌న‌స్సులో చోటుకోసం య‌త్నించాడా..? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనేకాదు దేశ‌వ్యాప్తంగా ఈ అంశం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఝార్ఖండ్ సీఎంకు చుర‌క‌లు అంటిస్తూ మ‌రీ ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌ధాని మోదీకి మ‌ద్ద‌తుగా నిలిచాడు. అయితే ఈ ట్వీట్‌పై జేఎంఎం సైతం ఘాటుగా స్పందించింది. మీ నిస్స‌హాయ‌త గురించి దేశం మొత్తం తెలుసు.. అంటూ రిప్ల‌య్ ఇచ్చింది. ఈ ట్వీట్లతో జ‌గ‌న్‌పై మోదీ మ‌న‌స్సులో ప్రేమ పుట్టిందోలేదో  తెలియ‌దు కానీ.. దేశ‌వ్యాప్తంగా మోదీ యాంటీ టీంనుంచి జ‌గ‌న్‌పై విమ‌ర్శలు వెల్లువెత్తాయి.
ప్ర‌ధాని మోదీ ఇటీవ‌ల కొవిడ్ వైర‌స్ విష‌యంపై రాష్ట్రాల సీఎంల‌తో మాట్లాడారు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌స్తావించి ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ .. మోదీ కేవ‌లం త‌న మ‌న్స‌సులో మాట‌నే చెప్పాడు.. దానికి బ‌దులు ప‌నికొచ్చే మాట‌లు చెబితే బాగుండేది అంటూ పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌కు జ‌గ‌న్ స్పందించాడు. ప్రియ‌మైన హేమంత్ సోరెన్‌, మీరంటే నాకు చాలా గౌర‌వంగా ఉంది. మ‌న మ‌ధ్య ఎన్ని విబేధాలున్నా ఇలాంటి రాజ‌కీయాలు చేయ‌డం త‌గ‌ద‌ని, అది మ‌న జాతిని బ‌ల‌హీన‌ప‌రుస్తుంద‌ని ఒక సోద‌రుడిగా విజ్ఞ‌ప్తి చేస్తున్న. కొవిడ్‌పై యుద్ధంలో మ‌న‌మంతా ప్ర‌ధానితో చేయిచేయి క‌లిపి అండ‌గా నిలుద్దాం అంటూ ట్వీట్ చేశాడు. జ‌గ‌న్ ట్వీట్‌కు దేశ‌వ్యాప్తంగా బీజేపీ యాంటీ టీం నుంచి విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఈ విష‌యంపై జేఎంఎంసైతం  త‌న అధికారిక ట్విట్ట‌ర్ వేదిక‌గా ఘాటుగా స్పందించింది. మీ నిస్స‌హాయ‌త గురించి దేశం మొత్తం తెలుసు.. మీరు ఎల్ల‌ప్పుడూ సుర‌క్షితంగా ఉండాల‌ని కోరుకుంటున్నాం అంటూ జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు పిటీష‌న్‌పై విచార‌ణ వాయిదాప‌డిన న్యూస్‌ను ట్యాగ్ చేసింది.
జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ట్వీట్ దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారితీసింది. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటినుంచి ప్ర‌ధాని మోదీకి అనుకూలంగా ఉంటూ వ‌స్తున్నాడు. లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌ల్లో కేంద్రం పెట్టిన బిల్లుల‌కు మ‌ద్ద‌తు ఇస్తూ త‌న విదేయ‌త‌ను చాటుకుంటున్నాడు. ఒక‌విధంగా చెప్పాలంటే కేంద్ర కేబినెట్‌లో వైఎస్ఆర్ సీపీ ఓ భాగ‌మ‌న్న భావ‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో ఉంది. వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిపై అక్ర‌మాస్తుల కేసులు విచార‌ణ‌లో ఉన్నాయి. సీబీఐ ప్ర‌త్యేక కోర్టులో విచార‌ణ‌లు జ‌రుగుతున్నాయి. ప్ర‌స్తుతం జ‌గ‌న్ బెయిల్‌పై బ‌య‌ట ఉన్నాడు. అయితే ఎన్నిపాట్లు ప‌డిన జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పై ఉన్న కేసులకు చెక్‌ప‌డ‌టం లేదు.
ఇటీవ‌ల వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌రాజు జ‌గ‌న్ బెయిల్‌ను ర‌ద్దుచేయాల‌ని, ఆయ‌న‌పై ఉన్న కేసుల‌ను విచార‌ణను వేగ‌వంతం చేయాల‌ని సీబీఐ ప్ర‌త్యేక కోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేశారు. పిటీష‌న్‌ను స్వీక‌రించిన కోర్టు.. జ‌గ‌న్ బెయిల్‌ను ఎందుకు ర‌ద్దుచేయ‌కూడ‌దో చెప్పాలంటూ సూచించింది. మే17కు విచార‌ణ వాయిదా ప‌డింది. ఈ క్ర‌మంలోనే బీజేపీ నేత‌లే స్పందించ‌ని ట్వీట్‌కు సీఎం జ‌గ‌న్ స్పందించి మోదీ జ‌పం చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. త‌న‌పై ఉన్న కేసుల ర‌ద్దుకోస‌మే జ‌గ‌న్ ఈ పాట్లు ప‌డుతున్నాడంటూ దేశ‌వ్యాప్తంగా చర్చ సాగుతుంది. జ‌గ‌న్ తీరుప‌ట్ల వైసీపీ శ్రేణుల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  ప్ర‌త్యేక హోదామీద ట్వీట్లు చేయొచ్చుగా అంటూ నెటిజ‌ర్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి జ‌గ‌న్ ట్వీట్ మోదీ మ‌న‌స్సును తాకి అక్రమాస్తుల కేసుల నుండి బ‌య‌ట‌ప‌డేలా చేస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: