ఎడిటోరియల్ : కరోనా తీసుకుంటున్న కనిపించని బలులివి !

కరోనాతోనే కాదు.. భయంతోనూ జనాలు సహజీవనం చేసేస్తున్నారు. ఇప్పుడు ఏమైంది కరోనా వస్తే భయపడాల్సిన పనేమీ లేదు. అది ఒక సాధారణ జ్వరం వంటిదే. కొద్ది రోజులు ట్రీట్మెంట్ చేయించుకుంటే సరిపోతుంది... తగ్గిపోతుంది. అనవసర ఆందోళన చెందవద్దు. పొద్దున్న లేస్తే చదివేవి, చూసేవి ఇవే. అసలు కరోనా వైరస్ కంటే... దాని తీవ్రతను పెంచి చూపిస్తున్న వార్తలోనే జనాలు ఎక్కువ భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. కరోనాతో జనాలు సహజీవనం.. మూతికి మాస్కులు పెట్టుకోవడం అలవాటు చేసేసుకున్నారు. గుంపులు గుంపులుగా తిరగడం మానేశారు. ఎవరి ఇంట్లో వారు కూర్చుని కాలక్షేపం చేస్తున్నారు. కరోనా చుట్టం చూపుగా రాలేదు. నెలలు, సంవత్సరాలు తిష్ట వేసేందుకు వచ్చేసింది అని అంతా అర్ధం చేసేసుకున్నారు. 


ఇప్పుడు మనకి కరోనా వచ్చినా పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు అని ఫిక్స్ అయిపోయారు. వచ్చిన ఇబ్బందల్లా, మానసిక వైరస్ తోనే, పైకి అంతా ధైర్యంగానే ఉన్నట్టుగా కనిపిస్తున్నా, కనిపించని శత్రువు భయంతో ఎక్కువ శాతం జనాలు కృంగిపోతున్నారు. ఎప్పుడు ఎవరికి ఏ విధంగా ఈ వైరస్ ఎటాక్ అవుతుందో తెలియకపోయినా, ఎవరిని బలి తీసుకుంటుందో అర్ధం కాకపోయినా.. ఏదో అవుతుంది అన్న ఆందోళనతో భయం భయంగా బతకాల్సి వస్తోంది. అసలు కరోనా కంటే అతి ప్రమాదకరమైన మానసిక కృంగుబాటు జనాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఏదో అయిపోతుంది అన్న అనవసర కంగారుతో పాటు భవిష్యత్తుపై భరోసా దొరకడంలేదు. 


అన్ని వ్యవస్థలూ అతలాకుతలం అయిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏ ఒక్కరూ ధైర్యంగా లేరు. ఏదో అయిపోతుంది అన్న మానసిక ఆందోళనే ఎక్కువయ్యింది. చేసేందుకు పనిలేక, తినేందుకు తిండిలేక క్షణక్షణం భయం భయం అన్నట్టుగా ఉంటున్నవారు ఎంతోమంది. పేగులు మెలిపెడుతున్నా, ఆకలిని చంపుకుని తినీ తినక, చాలీ చాలని సంపాదనతో బతుకు బండి భారంగా మోసుకొస్తున్న బడుగు జీవులు ఎంతో మంది. ఈ రోజు ఎలా గడుస్తుందో .. రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియక, అసలు ఈ దుర్భరమైన, దారుణమైన పరిస్థితి నుంచి ఎప్పుడు భయటపడతామో తెలియక సతమతం అయిపోతున్న వారు ఎందరో. బతుకు భారమై బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న వారు ఇంకెందరో.

 

 వార్తల్లో కనిపించని చావులు ఎన్నెన్నో. అక్కడా ఇక్కడా అనే తేడా లేదు. ప్రపంచమంతా ఇదే పరిస్థితి. ఎవరి ముఖాల్లోనూ మనస్ఫూర్తిగా వస్తున్న చిరు నవ్వులు కనిపించడం లేదు. మాస్క్ ల వెనుక నవ్వుని, బాధను, భయాన్ని దాచుకుని ఈ ప్రపంచాన్ని చూడాల్సిన పరిస్థితి వచ్చింది. కరోనా ప్రతక్షంగా వేలు, లక్షల మందిని పొట్టనపెట్టుకుంటున్నా, కరోనా సోకని వారిని మాత్రం మానసికంగా ప్రతిక్షణం చంపేస్తోంది. బతుకున్న జీవచ్ఛవాలుగా జనాలను మార్చేస్తోంది. బలమే జీవితం .. బలహీనతే మరణం అని వివేకానందుడు చెప్పినట్టుగా మానసిక బలహీనతతోనే ఇప్పుడు జనాలు యుద్ధం చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: