ఎడిటోరియల్ : అతుకులు గతుకులు ! కరోనా చేసిన గాయాలెన్నో ..

మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టుగా తయారయ్యింది  సామాన్య జనాల పరిస్థితి. రెక్కాడితే గాని, డొక్కాడదు అన్నట్టుగా ఉంటుంది మన దేశంలో మెజారిటీ జనాల పరిస్థితి. పైకి అభివృద్ధి చెందిన దేశంగానే గుర్తింపు పొందినా, అంతరిక్షంలో సైతం అద్భుతాలు సృష్టించగల శక్తి సామర్ధ్యాలు సంపాదించుకున్నా, చంద్రుడి మీద స్థిర నివాసం కోసం ప్రయత్నిస్తున్నా, ఇంకా ఈ భూమ్మీద ఆకలి కేకలతో అల్లాడుతున్న జనాభాకు కొదవేమి లేదు. ఏదో ఒక పని చేసుకుని ఆ రోజు వచ్చిన సొమ్ములతో నాలుగు మెతుకులు కడుపులో వేసుకోవాలని చూసే జనాభానే ఎక్కువ. ఇక మధ్యతరగతి బతుకుల గురించి చెప్పనవసరం లేదు. కష్టానికి, సుఖానికి మధ్య నలుగుతూ, సంతోషానికి దుక్కానికి మధ్య ఊగిసలాడుతూ ఉండే వారి సంఖ్యకూ తక్కువేమీ కాదు. ఉన్నంతలో ఏదో అలా అలా బతికేస్తూ, బతుకు భారమైనా లాక్కొస్తూ బండిని నడుపుతున్న సామాన్యుడిపై పిడుగులా వచ్చి పడింది కరోనా మహమ్మారి. ఆ ప్రభావం తో జనాలంతా అల్లాడిపోతున్నారు. గత ఏడాది డిసెంబర్ లో ఈ వైరస్ ప్రభావం కనిపించినా, అప్పట్లో ఎవరూ దీనిని అంత సీరియస్ గా పరిగణించలేదు. అదే ఇప్పుడు శాపంగా మారి శాపనార్ధాలు పెట్టించుకుంటోంది. 


చైనాలో పుట్టిన ఈ మహమ్మారి మనల్ని ఏం చేస్తుందిలే అన్న ధీమా అన్ని దేశాల్లోనూ కనిపించింది. క్రమక్రమంగా ఈ వైరస్ ప్రభావానికి ఒక్కో దేశం గురవుతూ వస్తోంది. ఇప్పుడు ప్రపంచాన్నే ఈ మహమ్మారి వణికిస్తోంది. ఎప్పటికప్పుడు ఈ వైరస్ ప్రభావం తగ్గుతుందనే ఎవరికి వారు కాస్త ధైర్యంగా ఉంటూ వస్తున్నా, ఈ మహమ్మారి ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. మన జీవితంలో మాస్కులు, శానిటైజర్ లు భాగస్వామ్యం అయిపోయాయి. కనీసం బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల వారి ఇళ్లకు వెళ్లేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది.

 


 ఇవన్నీ ఒక ఎత్తయితే, రెక్కాడితే గాని, డొక్కాడని వారు, రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతుకుబండిని లాక్కొస్తున్న వారు, చిరుద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా తయారయింది. అసలు కరోనా కంటే ఇప్పుడు ఉపాధి అవకాశాలు లేక, బతకలేక, చావలేక అన్నట్టుగా ఉన్న వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎవరిని కదిపినా, ఇదే రకమైన వ్యథలు కథలు కథలుగా వినిపిస్తున్నారు. సొంత ఊర్లో ఉపాధి దొరకక పట్టణాలకు, పక్క రాష్ట్రాలకు ఉపాధి నిమిత్తం వలస వెళ్తున్న వారి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అలాగే నిర్మాణరంగం, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అన్నీ కుదేలు అయ్యాయి. దేశవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తోంది.

 


అసలు ఈ వైరస్ ప్రభావం ఎప్పుడు ముగుస్తుందో తెలియకపోవడంతో, ఎవరికి వారు ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళనలోనే ఉంటూ వస్తున్నారు. లాక్ డౌన్ సమయంలోనే కాదు, ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలూ ఈ వైరస్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటునే వస్తున్నారు. పనిచేసే చోట అరకొర జీతాలు వచ్చినా, ఏదోలా సర్దుకుపోతూ వచ్చినా, ఇప్పుడు వాటికి కూడా గండి పెట్టేసింది ఈ మహమ్మారి. చిరుద్యోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలు మూతపడడంతో, ఆ రంగంపై ఆధారపడిన ఉపాధ్యాయులంతా రోడ్డున పడ్డారు. అన్ని రంగాలు, వ్యాపారాలు ఈ కరోనా కారణంగా దెబ్బతిన్నాయి. ఇక స్కూళ్ళు, కాలేజీలు మూతపడడంతో విద్యార్థుల చదువులూ అటకెక్కాయి.  

 


పట్టణాల్లోనూ నగరాలల్లోనూ ఇళ్లల్లో పని చేసుకునే లక్షలాది మంది అకస్మాత్తుగా ఉపాధి కోల్పోయారు. ఎవరినీ ఇళ్లల్లోకి రానిచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం కరోనా భయంతో ఎవరూ ఇల్లు దాటి కాలు బయటపెట్టేందుకు ఇష్టపడడంలేదు. ఈ  వైరస్ మహమ్మారి ముప్పు నుంచి తప్పించుకోవడానికి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుని ఇది విస్తరించకుండా అడ్డుకట్ట వేయడం తప్ప, మరో మార్గం కనిపించడం లేదు. పదులు, వందలు, వేలు దాటిపోయి లక్షల్లో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుత వాతావరణం కూడా ఈ మహమ్మారి విస్తరించడానికి మరో కారణం కావడంతో, ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన జనాల్లో కనిపిస్తోంది. ఈ కరోనా మహమ్మారి అందరి సరదా తీర్చేస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని గందరగోళాన్ని సృష్టిస్తోంది. భారంగా బతుకు బండి లాక్కొస్తున్న సామాన్యుడిపై మోయలేని భారాన్ని మోపింది. అన్ని వ్యవస్థలను అతలాకుతలం చేసేస్తోంది ఈ మాయదారి మహమ్మారి.  
 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: