కన్నీటి గీతం : గూడ్సు కింద నలిగి చచ్చిన పేదరికం

*రవాణా సౌకర్యాలు లేక, దరిదాపుల్లో పనులు దొరకక ఇళ్ళకో, కూలీ కోసమో కాలినడకన బయలుదేరిన అభాగ్యులు వాళ్ళు.

*రోడ్డు పట్టుకు నడిస్తే దూరం అవుతుందనీ, అర్ధరాత్రో అపరాత్రో తెలియని ప్రదేశంలో దారి తప్పే ప్రామాదం వుందని రైలు పట్టాల వెంట నడవాల్సిన దౌర్భాగ్యం.

*మాడ్చి మసిచేసే మే నెల ఎండల్లో పగలు నడక పరలోక యాత్రే అవుతుందని భావించి సాయంత్రం ఆరు తరవాత నడక ప్రారంభించి వుదయం నాలుగూ అయిదూ వరకూ నడవాల్సిన అగత్యం.

* రాత్రంతా రైలు కట్టన నడిచి తెల్లవారు ఝాముకు సత్తువ అంతా ఖర్చైపోయి, దగ్గరలో వూరో, స్టేషనో కానరాక పట్టాల మధ్యనే ఒక కునుకెయ్యాల్సొచ్చిన దరిద్రం.

* లాక్ డౌన్ కాబట్టి రాత్రంతా దారిలో ఒక్క రైలూ ఎదురు కాలేదు కాబట్టి పట్టాల మీద పడక పర్లేదు అనుకునే అమాయకత్వం.

*ఏ నగర వాసుల అవసరాన్ని తీర్చడానికి ఏ సౌకర్యాలు మోసుకు పోతుందో పాపం ఆ రైలు... కేవలం ఒక్కర్ని మాత్రమే క్షమించగలిగింది. పద్దెనిమిది మందిని ఈ జీవన నరకం నుండి విముక్తుల్ని చేసింది. క్యాష్ లెస్, వైర్ లెస్, ఆఫీస్ లెస్, మానవ సంబంధాలు లెస్ అని విర్రవీగే 21వ శతాబ్ధపు డిజిటల్ ఇండియాలో ఇంకా రైలు పట్టాల మీద పడుకునే బతుకులు ఎందుకున్నాయో, దానికి ఎవరు బాధ్యులో ఆలోచించేది ఎవరూ?

*ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్ ఓ వాటర్ ఫిల్టర్లు అత్యవసరంగా పెట్టాలనీ, ఆర్మీ ఇలాఖాల్లో గోల్ఫ్ కోర్టుల్లో పచ్చదనం తగ్గితే ఉజ్జోగం వూడుతుందనీ హుకుం జారీ చేసే ఈ దేశ పెత్తనం వీళ్ళు అసలు లేనే లేరని నమ్ముతుందా? రోడ్ల మీద సంచారాన్ని పిర్రల మీద లాఠీల నాట్యంతో కట్రోల్ చేయగలిగిన అధికారం రైలు పట్టాల మధ్య మూలుగుతూ నడుస్తున్న పాతగుడ్డల మూటల్ని గమనించలేదా? నెలన్నరగా వలస కార్మికుల బతుకులు రైలు పట్టాల మధ్య గులకరాళ్ళలో నలుగుతున్న విషయం ఇంకా ఏ ప్రభుత్వ చంచా చానెల్ లోనూ ఎవడూ చూడలేదా?

*లాక్ డౌన్ ముగిసే వరకూ మీకు అండగా మేం వుంటామని ఆ దారిలోని ఏ సమాజమూ భరోసా ఇవ్వలేకపోయిందా... ఏసీ ఇళ్ళల్లో , గేటెడ్ కమ్యూనిటీల్లో తలుపులేసుకుని కరోనా వంకన కులుకుతున్న నాగరికతకు వీళ్ళ బాధ్యత లేకుండా పోయిందా?... ఏదైతేనేం.... పద్దెనిమిది దౌర్భాగ్యాలు ముగిశాయి. ఈ యాడాది పేదరికపు గణనలో కాస్త చిన్న సంఖ్య వేసుకుని మురుసుకుందాం రండి.... రండీ.... బాల్కనీలోనో, టెర్రస్ మీదో ఎనామిల్ ప్లేట్లలోని ప్రోటీన్ సొబగులను స్టాన్లీ రోజర్స్ కట్లరీతో పొడుచుకు తింటూ వాళ్ళ ఆత్మశాంతికోసం కొన్ని క్యాండిల్స్ వెలిగిద్దాం!

- ఇండస్‌ మార్టిన్‌ ‍ ( ఫేస్‌బుక్ వాల్ నుంచి.. )

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: