ఎడిటోరియల్ : కరోనా కంగారు పెడుతోందే ? మూడో దశ దాటితే ?

ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో తెలియదు..! ఎప్పుడు దీని పీడా విరగడ అవుతుందో తెలియడం లేదు. కానీ మాయదారి మహమ్మారి ముప్పుతిప్పలు పెడుతోంది అంటూ జనం ప్రతిక్షణం తిట్టుకుంటూనే ఉంటున్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ వైరస్  భయంతో ప్రపంచదేశాలన్నీ ఆందోళన చెందుతున్నాయి. అంతేకాదు. ఈ కరోనా ధాటికి జనాలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు కూడా సాహసం చేయడంలేదు. ప్రభుత్వాలు కూడా ప్రజలను ఇళ్లకే పరిమితం అవ్వాల్సిందిగా పదే పదే కోరుతున్నాయి. అయినా కొంతమంది ప్రజలు మాత్రం దీనిని పట్టించుకోకుండా యథేచ్ఛగా అవసరం ఉన్నా, లేకపోయినా రోడ్లమీదకు వస్తూ కరోనాకు  కారకులుగా మారుతున్నారు. మన దేశంలోనూ అన్ని రాష్ట్రాలు ఈ వైరస్ ను అడ్డుకునేందుకు తమ శక్తి వంచన లేకుండా పోరాడుతున్నాయి. 

 


దేశంలో రెండోసారి విధించిన లాక్ డౌన్ కమ్యూనిటీ ట్రాన్సిషన్ ను అడ్డుకునేందుకు ఉద్దేశించింది. ఈ దశ అత్యంత కీలకమని వైద్యులు కూడా తరచుగా హెచ్చరికలు చేస్తున్నారు. అయితే మూడో స్టేజ్ దశను కొన్ని దేశాలు నిర్లక్ష్యం చేయడంతో అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. వేలకొద్ది మరణాలు, లక్షల సంఖ్యలో కేసులు నమోదు అవుతూ, రోజు రోజుకి పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో చాలా దేశాలు అల్లాడుతున్నాయి. అసలు ఈ కరోనా వైరస్ ఎవరు నుంచి సోకిందో తెలియకపోవడం మూడో దశగా పిలవబడుతోంది. తొలిదశలో విదేశాల నుంచి వచ్చిన వారు ఉండగా, రెండో దశలో వారి నుంచి ఈ వ్యాధి సోకిన వారు. 


మూడో దశలో ఎవరు ఈ వైరస్ వ్యాప్తికి కారణమో గుర్తించలేకపోవడం. ఈ దశను కనుక సమర్థవంతంగా ఎదుర్కోక పోతే ఇక మరణాలు ఆపడం ఎవరి వల్ల కాని పని గా మారుతుంది. అందుకే అంతవరకూ పరిస్థితి తెచ్చుకోకుండా అన్ని రాష్ట్రాలు కట్టుదిట్టంగా లాక్ డౌన్ నిబంధనలు అమలుచేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇక్కడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే వస్తున్నాయి. ప్రభుత్వాలు రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించి కరోనా కట్టడికి తగిన వ్యూహాలను అమలుచేస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం రేయింబవళ్ళు కష్టపడుతున్నా, కొన్ని జిల్లాల్లో కమ్యూనిటీ ట్రాన్సిషన్ నెమ్మదిగానే ఉంది. 

 


ఇప్పుడు ఇదే అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. రెడ్, బఫర్ జోన్స్ లో నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. వీటిపై పూర్తి స్థాయిలో నిఘా పెంచి పర్యవేక్షిస్తున్నారు. అయితే ఎన్ని చర్యలు తీసుకున్నా పరిస్థితి మాత్రం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలోని సూర్యాపేటలో 80 పాజిటివ్ కేసులు నమోదు అవ్వడం తెలంగాణ ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు. మూడో దశను కనుక సమర్థవంతంగా ఎదుర్కొకాకపోతే ఇక తర్వాత పరిస్థితిని అదుపు చేయడం కష్టమనే భావనలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారు. ఇక దాదాపు ఏపీలో పరిస్థితి ఇదే విధంగా తయారయింది. ఈ కరోనా మరింతగా విస్తరించకుండా ఉండాలంటే, ప్రజల్లో చైతన్యం రావాల్సి ఉంది. వారిలో కనుక మార్పు రాకపోతే కరోనాని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాని పని. ఏదైనా ప్రజల చేతిలోనే ఉంది అంటూ ప్రభుత్వాలు కూడా పదే పదే హెచ్చరికలు చేస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: