లోక్ సభ ముందుకు జమిలి బిల్లు..? ఎన్నికలు ఎప్పుడు అంటే..!
2027లో జమిలి ఎన్నికలు వస్తాయా? ముందస్తు ఎన్నికలు పెట్టే ఆలోచన ఉందా? అందుకే జమిలి బిల్లును ప్రవేశపెట్టాలని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పుడు జమిలి ప్రస్తావన వస్తోంది. ఇదే హాట్ టాపిక్ అవుతోంది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో అత్యున్నత కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ జమిలికి అనుకూలంగా నివేదిక ఇచ్చింది. అందుకు సంబంధించి బిల్లుకు క్యాబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది. దీంతో అప్పటి నుంచి 2027లో ముందస్తు ఎన్నికలు తప్పవని ప్రచారం నడిచింది.
అశేష భారతదేశంలో ఏకకాలంలో.. సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీకి ఒకేరోజు పోలింగ్ నిర్వహించడం అంటే కత్తి మీద సామే. అలాగని దీనిపై ఏకాభిప్రాయం కూడా కుదరడం చాలా కష్టం. అన్ని పార్టీల అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో ఇలా బిల్లు పెట్టేసి.. అలా అమలు చేసేసి.. వెంటనే ఎన్నికలు పెట్టేస్తారని చాలామంది భావిస్తున్నారు. అటు అధికారంలో లేని పార్టీలు దీనిపై చాలా ఆశలు పెట్టుకున్నాయి.
కానీ బిల్లులో ఉన్న అంశాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. బిల్లు ఇంకా పార్లమెంటులో పెట్టలేదు కానీ.. అందులో అంశాలను మీడియా వెల్లడిస్తోంది. అయితే తాజాగా బిల్లులో ఓ కీలక అంశం వెలుగులోకి వచ్చింది. దాని ప్రకారం జమిలి ఎన్నికలు 2034లో నిర్వహిస్తారని స్పష్టమైంది. ఇంతలో గ్రౌండ్ ప్రిపేర్ అయ్యేలా చట్టాల సవరణ, ఇతర జాగ్రత్తలు తీసుకునేందుకు కసరత్తు జరుగుతోంది.
గతంలో చాలా బిల్లులు ఆమోదానికి నోచుకున్నాయి. కానీ అమలు విషయానికి వచ్చేసరికి మాత్రం చాలా జాప్యం జరుగుతూ వచ్చింది. మహిళా బిల్లు కూడా గతంలో ప్రభుత్వం ఆమోదించింది. కానీ వెంటనే అమల్లోకి రాలేదు. నియోజకవర్గాల పునర్విభజన తరువాతే అమల్లోకి వస్తుందని చట్టంలో చేర్చారు. జమిలి ఎన్నికలకు అదే ఫార్ములాను ఉపయోగిస్తున్నారు. పార్లమెంటులో చేయబోయే రాజ్యాంగ సవరణలో రాజ్యాంగంలో కొత్తగా 82ఏ సెక్షన్ చేర్చబోతున్నారు. ఇది జమిలి ఎన్నికలకు నిర్దేశిస్తుంది. ఎమ్మెల్యేల పదవీకాలం, ప్రజా ప్రతినిధుల విషయంలో పార్లమెంట్ అధికారాలకు సంబంధించిన అంశాలను, వాటికి సంబంధించి సవరణలు చేయనున్నారు.