బీఆర్ఎస్ ని దెబ్బ మీద దెబ్బ కొడుతున్న రేవంత్? అసలు గ్యాప్ ఇవ్వడం లేదు గా?
ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్‌ను రెండో రాజధాని స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు. దీంతో మంత్రి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. తెలంగాణ సెంటిమెంటుతో గెలిచిన పార్టీ బీఆర్ఎస్ వరంగల్‌ను పెద్దగా పట్టించుకోలేదు. అందుకే.. ఈ అంశాన్ని ఇప్పుడు కాంగ్రెస్ నెత్తినేసుకుందని తెలుస్తోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా కొనసాగుతున్నారు.
భద్రకాళి చెరువు పరిధిలో కబ్జాలను ఉపేక్షించబోమని చెప్పారు. వరంగల్ పరిధిలోని అక్రమ కట్టడాలన్నింటినీ కూల్చివేస్తామని అన్నారు. వరంగల్ నగరానికి సంబంధించి అభివృద్ధి ప్రణాళికను కూడా సిద్ధం చేసినట్లు తెలిపారు. త్వరలోనే సీఎం రేవంత్ మరికొన్ని అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని వెల్లడించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను తీసుకొచ్చి.. మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామన్నారు. ముంపు బారి నుంచి నగరాన్ని కాపాడుతామన్నారు.
వరంగల్ వాసుల కల అయిన విమానాశ్రయాన్ని కూడా పూర్తిచేస్తామని వెల్లడించారు. ఏడాదిలోపే విమానాశ్రయం నిర్మిస్తామని చెప్పారు. మామునూరులో ఇప్పటికే ఉన్న ఎయిర్ పోర్టును కేంద్రం సాయంతో మళ్లీ ట్రాక్ మీదకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీని అడ్రస్ లేకుండా చేయాలని కాంగ్రెస్ భావిస్తోందట. ఈ మూడు జిల్లాల్లో గులాబీ పార్టీని పూర్తిగా కనుమరుగు చేస్తే ఆ పార్టీ ఇక భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉండకపోవచ్చని కాంగ్రెస్ అనుకున్నదంట. ఖమ్మంలో ఆ పార్టీకి పునాదులు లేకుండా అయింది. పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ పార్టీని బలోపేతం చేసుకోలేకపోయారు. నల్గొండలోను ఇక సేమ్ పరిస్థితి. ఉద్యమం వేళ మాత్రం ఈ రెండు జిల్లాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగింది. దీంతో మరోసారి అక్కడ అవకాశం దొరకకుండా చేయాలనేదే కాంగ్రెస్ పార్టీ ప్లానింగ్.
వరంగల్ రెండో రాజధాని పేరుతో ఆ జిల్లా వాసులకు బీఆర్ఎస్ పార్టీని దూరం చేయబోతున్నారన్న టాక్ నడుస్తోంది. ఇక ఇతర జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ స్కెచ్‌లు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ముందు ముందు అన్నిజిల్లాల్లోనూ బీఆర్ఎస్ పార్టీకి ఇదే పరిస్థితి ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది.