అమెరికాకు పారిపోయిన చంద్రబాబు.. నిజమేనా?

Chakravarthi Kalyan
ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమయంలో మంటుటెండను సైతం లెక్క చేయకుండా పార్టీ విజయం కోసం చెమటోడ్చిన ఆయా పార్టీల అధినేతలు ఇప్పుడు సేద తీరేందుకు విదేశాలకు చెక్కేస్తున్నారు. పోలింగ్ తర్వాత వచ్చిన గ్యాప్ ని ఈ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటికే సీఎం జగన్ తన సతీమణి భారతితో కలిసి లండన్ వెళ్లగా.. ఇప్పుడు చంద్రబాబు కూడా విదేశీ బాట పట్టారు.

అయితే జగన్ విషయంలో ఎల్లో మీడియా వక్రీకరించిన విధంగానే చంద్రబాబు పర్యటనను వైసీపీ అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేసింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్తున్నారు అంటూ కథనం ప్రచురితం చేసింది. ఫైబర్ నెట్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆయనపై సుప్రీం కోర్టులో విచారణ సాగుతోంది. దీంతో శంషాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారని పేర్కొంది. అయితే సుదీర్ఘ వివరణ అనంతరం ఎట్టకేలకు అనుమతి ఇచ్చారని వివరించింది.

స్కిల్ స్కాం కేసులో ప్రధాన నిందితులైన చంద్రబాబు, ఆయన మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, కిలారు రాజేశ్ పై సీఐడీ గతంలో లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. సీఐడీ అదనపు డీజీ అనుమతి లేనిదే వారు విదేశాలకు వెళ్లకూడదు. కానీ చంద్రబాబు ఎవరి అనుమతి తీసుకోకుండానే గుట్టు చప్పుడు కాకండా అమెరికా వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. మరోవైపు ఫైబర్ నెట్ కేసు ముందస్తు విచారణలో ఉండగా..కోర్టుకి సమాచారం ఇవ్వకుండా విదేశాలకు వెళ్లాలనుకోడం మరో విశేషం.

దీంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకోవడంతో కాసేపు విమానాశ్రయంలో చర్చ జరిగింది. సీఐడీ అధికారులు వివరణ తీసుకున్నారు. వారు అనుమతి ఇవ్వడంతో చంద్రబాబు తన సతీమణితో కలిసి విదేశాలకు పయనమయ్యారు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే.. సీఐడీ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినంత మాత్రాన ఏమీ జరగదని విశ్లేషకులు అంటున్నారు. జగన్ మాదిరి కోర్టుల్లో స్టే ఉంటే ఆపుతారు. కానీ చంద్రబాబు విషయంలో అలాంటి షరతులు ఏమీ లేవు. ఇది పూర్తిగా వక్రీకరించిన కథనంగా వారు కొట్టి పారేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: