ఆ రాష్ట్రంలో మోదీ మత రాజకీయం ఓట్లు కురిపిస్తుందా?

Chakravarthi Kalyan
ఒకప్పటి కమ్యూనిస్టుల కంచుకోట పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొన్నేళ్లుగా సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బెంగాల్ బొబ్బిలి మమత దెబ్బకు రాష్ట్రంలో 34 ఏళ్ల సుదీర్ఘ కమ్యూనిస్టు పాలనకు తెరపడటమే కాకుండా కాంగ్రెస్ ప్రాభవానికి గండి కొట్టింది.  ఈ రాజకీయ శూన్యాన్ని భర్తీ చేస్తూ బీజేపీ క్రమంగా బెంగాల్లో పాగా వేస్తోంది.

గత లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 18 సీట్లను కొల్లగొట్టి మమతకు పక్కలో బల్లెంలా మారింది. అనంతరం గత అసెంబ్లీ ఎన్నికల్లోను 77 సీట్లతో సత్తా చాటాంది. కొంతకాలంగా రాష్ట్రం తృణమూల్, బీజేపీ ముఖాముఖి పోరుకు వేదికగా మారిపోయింది. బెంగాల్లో ఈ లోక్ సభ ఎన్నికలు ప్రధాని మోదీ వర్సెస్ మమత అన్నట్లు సాగుతున్నాయి. అయితే ప్రస్తుతం అక్కడ శ్రీరామ నవమి వేడుకలకు సంబంధించి రాజకీయాలు హీటెక్కాయి.

ఇద్దరి మధ్య ఈ విషయమై మాటల యుద్ధం నడుస్తోంది. బెంగాల్ లో శ్రీరామ నవమి వేడుకలను ప్రభుత్వం అడ్డుకుంటోందని ప్రధాని మోదీ ఆరోపించారు. దీనిని మమత తిప్పికొట్టారు. మత ఉద్రిక్తలను రెచ్చగొట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమె విమర్శించారు. కాగా శ్రీరామ నవమి వేడుకలు చేసుకునేందుకు మమత సర్కారు అభ్యంతరం చెప్పగా.. వీహెచ్ పీకి  కల్ కత్తా హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే గత ఏడాది ర్యాలీ సందర్భంగా చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రదర్శన మార్గాన్ని మార్చాలని బెంగాల్ ప్రభుత్వం సూచించింది.

ఈ నేపథ్యంలో మమత, మోదీలు మాటల యుద్దానికి దిగారు. నవమి వేడుకలకు అనుమతినివ్వని తృణమూల్ ప్రభుత్వం.. ర్యాలీపై రాళ్లు వేసేవారికి మాత్రం అనుమతిస్తోందని మోదీ మండి పడ్డారు. మరోవైపు బీజేపీ ఒత్తిడితోనే ఎన్నికల సంఘం రాష్ట్రంలో అధికారులను మార్చేసిందని.. ఇప్పుడేదైనా ఉద్రిక్తతలు తలెత్తితే ఈసీయే బాధ్యత వహించాలని మమత పునరుద్ఘాటించారు. చివరకు ఈ మత రాజకీయం ఎవరికీ ఓట్లు రాలుస్తుందో చూడాలి. మోదీ మత రాజకీయం ఇక్కడ ఓట్లు కురిపిస్తుందా.. లేదా.. మమత సెంటిమెంట్‌ డ్రామా వర్కవుట్‌ అవుతుందా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: