టీడీపీ ఆయువుపట్టుపై గురి పెట్టిన జగన్‌?

Chakravarthi Kalyan
ఏపీలో ఎన్నిలకు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్నాయి. ఇందుకోసం ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో నాయకుడూ ఒక్కో శైలిని అనుసరిస్తున్నారు. జగన్ కూడా వైసీపీని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ముందుగా క్యాడర్ ను సిద్దం చేస్తున్నారు. దీనికోసం సిద్ధం పేరిట బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధి పనుల్ని ప్రజలకు వివరిస్తున్నారు.

ఇదే సమయంలో చంద్రబాబు కూడా రా కదిలిరా పేరిట సభలు నిర్వహిస్తూ కార్యకర్తలను ఉత్సాహ పరుస్తున్నారు. తనకు ఇవే చివరి ఎన్నికలు అంటూ ఒక సంకేతాన్ని కూడా ప్రజలకు ఇచ్చారు. అయితే ఈ ఎన్నికల్లో గెలుపు రెండు పార్టీలకు అత్యంత అవసరం. ఎందుకంటే ఒకవేళ ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే ఏపీలో టీడీపీని కనుమరుగు చేసి పూర్తిగా బలపడుతుంది. ఇది టీడీపీకి చావు దెబ్బ అవుతుంది. అదే వైసీపీ ఓడిపోతే జగన్ ను జైలుకి పంపించి ఆ పార్టీకి భవిష్యత్తు లేకుండా చేయాలని చంద్రబాబు వ్యూహాలు పన్నుతారు. ఎవరి ఆలోచనలు వారివి.

మొత్తంగా రెండు పార్టీలు కూడా చావోరేవో అనే తరహాలో కొట్లాడుతున్నాయి. ఈ సమయంలో ప్రయోగాలు చేయడానికి ఎవరైనా వెనుకాడతారు. కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ప్రయోగాలను విపరీతంగా చేస్తున్నారు. అది కూడా టీడీపీ కంచు కోట అయిన బీసీ సామాజిక వర్గాన్ని తన వైపునకు తిప్పుకునేందుకు శత విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎలా అంటే ఉన్న ఎనిమిది రాజ్యసభ స్థానాల్లో నాలుగింటిని బీసీలకు ఇవ్వడం ఒక ఎత్తు అయితే.. ఇప్పటి వరకు విడుదల చేసిన 16 స్థానాల్లో తొమ్మిందింటిని బీసీలకే కేటాయించారు. ఓవరాల్ గా చూసుకుంటే వైసీపీ ఇప్పటి వరకు 63 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో బీసీలు 18 సీట్లను బీసీలకే కేటాయించారు.  21 చోట్ల ఎస్సీ అభ్యర్థులను బరిలో దించుతున్నారు. ఎస్టీలు చూసుకున్నట్లయితే మూడు ఎమ్మెల్యే స్థానాలు, ఓ ఎంపీ స్థానాన్నిఇచ్చారు. మైనార్టీలకు అయిదు సీట్లు ఇచ్చారు. ఓసీలకు 16 అసెంబ్లీ స్థానాలు, నాలుగు ఎంపీ స్థానాలు మాత్రమే కేటాయించారు. మరి సోషల్ ఇంజినీరింగ్ వర్కౌట్ అవుతుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: