షర్మిల, సునీత.. కడపలో జగన్‌కు చెక్‌ పెడతారా?

Chakravarthi Kalyan
జగన్ అనుకున్నట్లు అయింది. చెల్లెళ్లూ ఇద్దరూ కలిసి ఒకే వేదికపైకి వచ్చారు. అన్నను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని వ్యూహ రచన చేయడం ప్రారంభించారు. సొంత జిల్లా కడప నుంచి దెబ్బతీయాలని భావిస్తున్నారు. షర్మిళ పీసీసీ పగ్గాలు స్వీకరించిన దగ్గర నుంచి.. వైఎస్ వివేకా కుమార్తె సునీత కాంగ్రెస్ లో చేరుతారు అనే ప్రచారం సాగింది. కడప నుంచి ఆమె పోటీ చేస్తారని టాక్ నడిచింది.

ఏపీసీసీ అధ్యక్షురాలిగా షర్మిళ రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్నారు. ప్రస్తుతం కడప జిల్లాలో ఉన్న షర్మిళను సునీత కలిశారు. ఇడుపులపాయలో దాదాపు రెండు గంటలపాటు చర్చించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో సునీత గట్టిగానే  పోరాడుతున్నారు. తన తండ్రి హత్య కేసులో నిందితులని జగన్ కాపాడుతున్నారని ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అటు నిందితుల నుంచి సునీత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఆసమయంలో షర్మిళ సునీతకు అండగా నిలిచారు. ఆమె న్యాయపోరాటానికి వెన్నుదన్నుగా ఉన్నారు.

ఇప్పుడు అదే షర్మిళ పీసీసీ పగ్గాలు స్వీకరించడంతో ఆమెకు అండగా ఉండాలని సునీత నిర్ణయించుకున్నారు.  రాజకీయ  రంగ ప్రవేశం చేసి తండ్రి హత్య  కేసులో నిందితులకు గట్టిగానే బుద్ధి చెప్పాలని భావిస్తున్నారు. కాగా పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి జగన్, పార్లమెంట్ నుంచి ఎంపీ అవినాశ్ రెడ్డి పోటీచేయడం ఖాయంగా తేలుతోంది.  అందుకే వారిద్దరికీ ఎదురెళ్లాలని షర్మిళ, సునీత నిర్ణయించుకున్నట్లు సమాచారం.

కడప పార్లమెంట్ కు సునీత లేదంటే ఆమె తల్లి సౌభాగ్యమ్మ పోటీ చేయాలని షర్మిళ సూచించినట్లు సమాచారం. తాను ఇక్కడే ఉండి అన్నీ చూసుకుంటానని అవసరమైతే పులివెందుల నుంచి తాను బరిలో ఉంటానని షర్మిళ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో కడప జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. ఇప్పటికే జగన్ ను రాజకీయంగా దెబ్బతీయాలని టీడీపీ, జనసేన ఒక్కటయ్యాయి. ఇప్పుడు సోదరిలిద్దరూ అన్నకు ఎదురు వెళ్లాలని నిర్ణయించుకోవడం ద్వారా వారికి ఆయుధాలు అందించినట్టే అవుతుంది. మరి ఇందులో వీరిద్దరూ ఎంతవరకు విజయవంతం అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: