రాజ్యసభకు చిరంజీవి.. ఎంతవరకూ సాధ్యం?

Chakravarthi Kalyan
మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన నటనతో అందర్నీ ఆకట్టుకునే ఈయన హీరోగా అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారు. కేవలం సినిమాల్లోనే కాకుండా గతంలో రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చి ఈ తర్వాత మళ్లీ రాజకీయాలకు దూరం అయ్యారు. ప్రస్తుతం చిరంజీవికి  కేంద్రం భారత రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ ఇవ్వడం వెనుక రాజకీయ కోణం ఉందనే టాక్ వినిపిస్తోంది.

 
కేంద్రంలో అధికార బీజేపీ మెగాస్టార్ కు ఉత్తర్ ప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా పంపించాలని చూస్తోందనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠకు ఆయన కుటుంబాన్ని ఆహ్వానించడం.. ఆ తర్వాత ఆయనకు పద్మ విభూషణ్ ఇవ్వడాన్ని ముడి పెడుతున్నారు. అయితే వీటన్నింటిని కొంతమంది విశ్లేషకులు వదంతలుగా కొట్టి పారేస్తున్నారు. ఆయన తిరిగి రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు.


దీని వెనుక మరో కోణం ఉందని వారు పేర్కొంటున్నారు. జనసేనకు, బీజేపీకి మధ్య చిచ్చు పెట్టడం.. లేదా పవన్ అభిమానులను బీజేపీపైకి రెచ్చగొట్టడం దీని వెనుక ఉద్దేశంగా కనిపిస్తోంది. చిరంజీవికి రాజ్య సభ ఇవ్వడం వల్ల బీజేపీకి అదనంగా చేకూరే ప్రయోజనం ఏమీ లేదు. ఒకవేళ కళాకారుల కోటాలో ఇవ్వాలనుకుంటే తప్పులేదు.  ఇప్పుడు ఉన్న సీట్లన్నీ రాజకీయ సంబంధమైనవి. ఎమ్మెల్యేలు ఎన్నుకోవాల్సినవి. ఫలితం ఓ రాజకీయ నాయకుడిని కోల్పోయే అవకాశం ఉంటుంది.


పవన్ కల్యాణ్ ను బీజేపీ దూరం చేస్తోంది. కావాలనే తొక్కేస్తోంది. అందుకే అన్న చిరంజీవిని తెరపైకి తీసుకువచ్చింది అంటూ పవన్ కల్యాణ్ అభిమానులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. చిరంజీవి సన్నిహిత వర్గాల సమాచారం మేరకు మళ్లీ రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు మెగాస్టార్ సిద్ధంగా లేరు. ఆయన పెద్ద మనిషిగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చినందుకే ఆయన విలువ కొంతమేర తగ్గిపోయింది. పోయిన చోటే వెతుక్కొని ఇప్పుడు మళ్లీ దానిని తిరిగి నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం సినీ రంగం నుంచే ఆయనకు పద్మ విభూషణ్ వచ్చింది. అందువల్ల రాజకీయాల్లోకి వచ్చేసాహసం మళ్లీ ఆయన చేయరు అనేది విశ్లేషకుల వాదన. చూద్దాం ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: