టీడీపీ- జనసేన.. కలహాల కాపురం?

Chakravarthi Kalyan
చంద్రబాబు విచిత్ర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్లు ఉంది ఆయన పరిస్థితి. వైసీపీని గద్దె దించాలని ఆయన జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. కానీ పొత్తు పొడవాలంటే సీట్లు త్యాగం చేయాల్సిన పరిస్థితి. గతంలో అనుకున్నదానికంటే ఎక్కువ సీట్లు కావాలని జనసేన నుంచి సంకేతాలు వస్తున్నాయి. టీడీపీకి తప్పకుండా దక్కుతాయని భావించిన రెండు సీట్లను చంద్రబాబు ప్రకటిస్తే.. పవన్ సైతం మరో రెండు నియోజకవర్గాలను ప్రకటించారు.

ఇదీ చాలదన్నట్లు మూడో వంతు సీట్లపై పట్టుబడుతున్నారు. దీంతో చంద్రబాబు ఒక రకమైన ఢిపెన్స్ లో పడినట్లు వార్తలు వస్తున్నాయి. ముందస్తు అనుకున్న ప్రకారం ఈ నెల 29 వరకు జనంలోనే ఉండాలని నిర్ణయించుకొని రోజుకు రెండేసి సభలు చంద్రబాబు  నిర్వహిస్తున్నారు. అయితే అకస్మాత్తుగా సభలను రద్దు చేసుకొని చంద్రబాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం తీవ్ర చర్చనీయాంశం అయింది.

దీని వెనుక ముఖ్య కారణం పొత్తుల వ్యవహారమే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పవన్ చాలా స్పష్టంగా మూడో వంతు సీట్లు అంటే సుమారు 60 స్థానాలు, సీఎం పవర్ షేరింగ్ విషయం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అయితే సీఎం గా చంద్రబాబే ఉంటారు అని డిప్యూటీ సీఎం కూడా చంద్రబాబు నిర్ణయం మేరకే ఉంటుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రకటించడంతో జనసైనికులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.

చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో తొలి ఏడాదిన్నర సీఎం పదవి జనసేనకే అని చెప్పిన తర్వాతే పవన్ పొత్తు ప్రకటించారు అని విశ్వసనీయ సమాచారం. అయితే నారా లోకేశ్ ప్రకటనతో అలకబూనిన పవన్ నారా లోకేశ్ పాదయాత్ర ముగింపు సభకు ముందుగా రానన్నారు. ఆ తర్వాత చంద్రబాబు వెళ్లి పవన్ తో భేటీ అయిన తర్వాత రావడానికి ఒప్పుకున్నారు. ఇప్పుడు కూడా సీట్ల విషయం తేల్చాల్సిందే అని పవన్ కోరడంతో ఆ విషయంపై కసరత్తుల కోసమే చంద్రబాబు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: