కేటీఆర్‌ తీరుతో బీఆర్‌ఎస్‌ మరింత నష్టపోతోందా?

Chakravarthi Kalyan
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ ఆ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోవడంపై కాకుండా అధికార కాంగ్రెస్ పై విమర్శలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఈ నెల 3 నుంచి నుంచి 22 వరకు మొత్తం 16 రోజుల పాటు 17 ఎంపీ స్థానాలపై సమీక్షా సమావేశాలు నిర్వహించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి తేరుకొని  పార్లమెంట్ పై దృష్టి సారించాలని క్యాడర్ కు దిశా నిర్దేశం చేసినట్లు కనిపిస్తున్నా.. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలపైనే ఎక్కువ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ సమీక్షా సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలపైనే మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ లు విమర్శానాస్త్రాలు సంధించారు. అంతేకానీ పార్టీ నిర్మాణంపై, దాని బలోపేతంపై లోతైన చర్చ జరగలేదన్న గుసగుసలు ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి.

ప్రభుత్వంపై పెట్టిన శ్రద్ధ పార్టీపై పెట్టలేదని కార్యకర్తలు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా దానిని ఆయన సైతం సమ్మతించారు. క్యాడర్ ను అసలు పట్టించుకోలేదని.. ఎమ్మెల్యేల కేంద్రంగా పార్టీ పనిచేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.  బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ లు తమను కలిసిందే లేదని పార్టీ సీనియర్ నాయకులు సమీక్షా సమావేశం సందర్భంగా బాహాటంగా తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.

వారిని కలిసేందుకు వస్తే అపాయిట్ మెంట్లు దొరికేవి కావని.. ఒకవేళ దొరికినా ఎమ్మెల్యేలు తమను కలవనీయకుండా అడ్డుకున్నారంటూ వాపోయారు. దీంతో సొంత పార్టీ నేతలే ఈ సారి ఓడించారని వివరించారు. క్షేత్రస్థాయిలో నిర్మాణం, కమిటీలు, అనుబంధ కమిటీలు ఏర్పాటు చేయకపోవడం కూడా పార్టీ ఓటమికి కారణంగా పలువురు పేర్కొంటున్నారు. ఈ నివేదికలను ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పార్టీ నాయకులు పంపించారు. ఆయన వాటిని పరిశీలించి జిల్లా నాయకులకు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.  తుంటి ఎముక విరిగి కోలుకుంటున్న కేసీఆర్ త్వరలోనే జిల్లాల పర్యటన చేపట్టనున్నట్లు కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: