జగన్.. ఇకనైనా ఆ మాటలు మానుకుంటే బెటర్?
వ్యూహమో.. ఏంటో తెలియదు కానీ జగన్ మళ్లీ పవన్ పెళ్లిళ్ల పై పడ్డారు. పవన్ తనపై రాజకీయ విమర్శలు చేస్తుంటే జగన్ మాత్రం వ్యక్తిగతంగానే విమర్శిస్తున్నారు. జనానికి తెలియంది.. ఏమైనా కొత్తగా చెబుతున్నారా అంటే అదీ లేదు. విడిపోయిన వారు గొడవలు చేయడం లేదు. కానీ జగన్ మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా పవన్ వైవాహిక జీవితం గురించే మాట్లాడుతున్నారు.
ఇటీవల సామర్లకోటలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ… దత్తపుత్రుడికి శాశ్వత ఇల్లు ఏపీలో ఉండదు. హైదరాబాద్ లో ఉంటుంది. కానీ ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రం మూడు, నాలుగేళ్లకు మారుతూ ఉంటుంది. ఒకసారి లోకల్, మరోసారి నేషనల్, మరోసారి ఇంటర్ నేషనల్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. కానీ పవన్ మాత్రం వారాహి యాత్రలో ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలపై మాట్లాడారు. ప్రజా వ్యతిరేక విధానాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎక్కడా వ్యక్తిగత ఆరోపణలకు వెళ్లలేదు.
అయితే జగన్ లో ఒత్తిడి కనిపిస్తోంది. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పవన్ వ్యవహరించిన తీరు కంటగింపును కలిగించి ఉండొచ్చు. అందుకే తన స్థాయిని మరిచి కామెంట్లు చేస్తున్నారు. జైల్లో ఉన్న చంద్రబాబుని కలిసి పవన్ పొత్తు ప్రకటించారు. బీజేపీలోను ఒక కదలిక తీసుకువచ్చారు. వీటన్నింటికి కారణం పవన్ అని జగన్ భావిస్తున్నారు కావొచ్చు. అందుకే రాజకీయ ఆరోపణలు చేయలేక వ్యక్తిగత విమర్శలకు దిగారని జనసైనికులు ఆరోపిస్తున్నారు.