అయ్యో దేవుడా.. ఊయలే ఉరితాడు అయ్యిందే?
కొన్ని ఘటనల్లో అప్పుడు వరకు సంతోషంగా గడిపిన వారు క్షణాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోతూ ఉంటే.. మరికొన్ని ఘటనల్లో అభం శుభం తెలియని వారి విషయంలో కూడా విధి కాస్తయినా జాలి చూపించకుండా ఎంతో కఠినంగా ప్రవర్తిస్తుందేమో అని అనిపించే ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఇక ఇటీవల నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలంలో కూడా ఇలాంటి తరహా విషాదకర ఘటన వెలుగు చూసింది. కొడుకు ఆడుకుంటాడు అని భావించి తల్లిదండ్రులు అతని కోసం ఒక ఊయాలను కట్టారు. కానీ ఆ ఊయలే అలా ముద్దుగా పెంచుకున్న కొడుకు ప్రాణాలు తీస్తుందని మాత్రం ఊహించలేకపోయారు.
మండలంలోని మాధవాని పల్లి గ్రామానికి చెందిన కందూరి సైదులు, రేనమ్మకు కూతురు కుమారుడు మస్తాన్ ఉన్నారు. కాగా కూతురు కస్తూరిబాలో చదువుతూ ఉండగా కుమారుడు ఆమ్రాబాదులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నాడు. అయితే ఇటీవల ఆదివారం సెలవు దినం కావడంతో ఇంటి వద్ద ఉన్నాడు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు వ్యవసాయ పనుల కోసం బయటికి వెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఓ పక్కన తీగతో కట్టి ఉన్న ఉయ్యాలకు మస్తాన్ వేలాడుతూ కనిపించాడు. ఊయల నుంచి దింపి చూడగా ఆచేతనంగా ఉండడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే బాలుడు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించడంతో తల్లిదండ్రులు బోరును విలపించారు.