ఎట్టెట్టా: షీనా బోరా బతికే ఉందా?
2012లో షీనా బోరాను హతమార్చిన కేసులో నిందితురాలు ఇంద్రాణీ.. 2015వ సంవత్సరం నుంచి జైలులోనే ఉన్నారు. తాజాగా ఆమె తన కూతురు బతికే ఉందని ఎవరూ ఊహించని విధంగా ట్విస్ట్ ఇచ్చింది. తనతోపాటు జైలులో ఉన్న ఓ మహిళ కశ్మీర్‌లో తాను షీరా బోరాను కలిశానని తనకు చెప్పిందంటూ ఇంద్రాణీ సీబీఐకి రాసిన లేఖలో పేర్కొందట. అధికారులు వెంటనే కశ్మీర్ లో ఉన్న షీనా బోరాను వెతికి పట్టుకోవాలని ఆమె అభ్యర్థించింది. అయితే సీబీఐకి ఇంద్రాణి రాసిన లేఖలో ఏముందో తనకు పూర్తిగా తెలియదని స్వయంగా ఆమె తరఫు లాయర్ చెబుతున్నారు. దీంతో సీబీఐకి ఇంద్రాణీ రాసిన లేఖలో ఏముంది అన్నది స్పష్టత రావాల్సి ఉంది.
ఇక కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. 2012లో షీనా అనూహ్యంగా అదృశ్యమైంది. సుమారు మూడేళ్ల తర్వాత షీనా బోరాను హత్య చేసింది ఆమె తల్లి ఇంద్రాణీ ముఖర్జీనే అని సీబీఐ అధికారులు తేల్చారు. 2015లో ఆమెను అరెస్ట్ చేశారు. అప్పట్ట్నుంచి ముంబయిలోని బైకుల్లా జైలులో ఇంద్రాణి ఉంటోంది. ఆ తరువాత కేసు విచారణను సీబీఐకి అప్పజెప్పారు. దర్యాప్తులో కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగుచూశాయి. ఇంద్రాణీ తన రెండో భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శాంవర్ రాయ్‌ల సపోర్టుతో షీనాను హత్య చేసినట్లు వెల్లడైంది. డ్రైవర్ ఇచ్చిన సమాచార ఆధారంగా ముంబయికి సమీపాన అటవీ ప్రాంతంలో షీనా అవశేషాలను వెలికితీశారు. దీనిపై మళ్లీ 2017లో కేసు విచారణ మొదలైంది. కోర్టు ఇప్పటివరకు 60 మంది సాక్ష్యులను విచారించింది.
ఇదిలావుంటే, విచారణ సమయంలోనే పీటర్, ఇంద్రాణీ విడాకులు తీసుకున్నారు. పీటర్‌కు 2020లో బెయిల్ మంజూరైంది. అయితే బైకుల్లా జైలులో ఉన్న ఇంద్రాణీ.. గత నెలలో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోగా హైకోర్టు తిరస్కరించింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఇంద్రాణీ ఉన్నట్లు ఆమె తరఫు లాయర్ ద్వారా తెలుస్తోంది. ఈ సమయంలో తన కుమార్తె షీనా బోరా బతికే ఉందంటూ తల్లి ఇంద్రాణి సీబీఐకి లేఖ రాయడంతో.. ఈ కేసు మళ్లీ మొదటికి వస్తుందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. మొత్తంమీద, హత్య గురైన షీనా బోరా నిజంగానే బతికే ఉందా? ఆమె తల్లి రాసిన లేఖలో అసలు ఏముంది? అసలు ఈ హత్య ఎప్పుడు.. ఎలా జరిగింది? అన్నది చర్చనీయాంశంగా మారింది.