మలయాళ సినిమా "ప్రేమమ్" తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన భామ సాయి పల్లవి. ఈ సినిమా విడుదలై నేటికి (మే29) ఆరేళ్ళయింది. మలయాళ సినిమాతో సాయి పల్లవి ఎంట్రీ ఇచ్చింది...తమిళనాడు నుండి వచ్చింది.... కానీ హీరోయిన్ గా ఎక్కువ సినిమాలు చేసింది చేస్తోంది మాత్రం మన టాలీవుడ్ లోనే అని చెప్పాలి. ప్రేమమ్ సినిమా మలయాళ చిత్రం అయినప్పటికీ ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ తో భాష అర్థం కాకపోయినా తెలుగు సినీ ప్రియులు చూసేశారు. అంతే కాకుండా ఈ సినిమా టీచర్ గా నటించిన సాయి పల్లవికి ఫిదా అయ్యారు. ఆ తరవాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన "ఫిదా" సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఈ సినిమాలో భానుమతి ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల అంటూ తెలంగాణ యాసలో ఆదరగొట్టింది. మరోవైపు ఈ సినిమాలో సాయి పల్లవి స్టెప్పులు వేసిన "వచ్చిందే మెల్లా మెల్లగ వచ్చిందే" అనే పాటతో యుట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఆ తరవాత నాని సరసన ఎంసిఏ, శర్వానంద్ పక్కన పడి పడి లేచే మనసు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అంతే కాకుండా తమిళ మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసింది. అయితే సాయి పల్లవి ఇప్పటి వరకు చేసింది మొత్తం 9 సినిమాలే అయినా సౌత్ లో ఒక రేంజ్ క్రేజ్ సంపాదించికుంది. దాంతో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా వుంది. ఇక తెలుగులో ఇప్పటికే విరాటవర్వం, లవ్ స్టొరీ చిత్రాల షూటింగ్ ను పూర్తి చేసుకుంది. లవ్ స్టోరీ సినిమాలో సాయి పల్లవి సారంగదరియా పాటతో తన ఫిదా రికార్డులను తానే బీట్ చేసింది. ఇక ఈ రెండు సినిమాలు పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే విడుదలకు సిద్దంగా ఉన్నాయి. మరో వైపు నాని శ్యామ్ సింగరాయ్ లోనూ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే సినిమా పోస్టర్ ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఆరేళ్లకే ఎంతో గుర్తింపును తెచ్చుకున్న సాయి పల్లవి ముందు ముందు ఎలాంటి రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి.