బాలుడిపై లైంగిక దాడి..?

Suma Kallamadi
ఓ బాలుడి వ్య‌థ దేశాన్ని క‌లిచివేస్తోంది. ముక్క‌ప‌చ్చ‌లార‌ని ఆ బాలుడిపై కామాంధులు చేసిన అత్యాచారం ప్ర‌తి ఒక్క‌రి మ‌న‌సుల్ని మ‌దింప‌జేస్తోంది. అయితే ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్య‌లు అంద‌రినీ ఆలోచింప‌జేస్తున్నాయి. బాలుడిపై అత్యాచారం జ‌ర‌గ‌క ముందు ఉన్న స‌మ‌యాన్నితీసుకురాలేమ‌ని, తాము కాలాన్ని వెన‌క్కు తిప్పే శక్తిని క‌లిగి లేమ‌ని చెప్పింది.
అంటే ఆ శ‌క్తి ఉంటే త‌ప్ప‌కుండా బాలుడికి అన్యాయం జ‌ర‌గ‌కుండా చూసేవాళ్ల‌మ‌ని కోర్టు ఉద్ధేశ్యం. అయితే తాము బాలుడికి మానసిక భద్రత కల్పించగలమ‌ని, నష్టపరిహారం ఇప్ప‌టించి భ‌రోసా ఇవ్వ‌గ‌ల‌మ‌ని కోర్టు తెలిపింది. 2020లో ఆరేళ్ల బాలుడిపై జరిగిన లైంగిక దాడి కేసును ఈరోజు విచారించిన ఢిల్లీ హైకోర్టు దీనిపై కీలక వ్యాఖ్యలు చేసింది.
బాలుడికి న‌ష్ట‌ప‌రిహారంగా రూ. 50 వేలు ప్రకటిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. అది బాలుడికి జరిగిన అన్యాయాన్ని పూడ్చ‌లేద‌ని, అది చాలా త‌క్కువ సాయం అని పేర్కొంది. కనీసం మధ్యంతర కాలంలో అయినా ఈ పరిహారాన్ని పెంచి ఉంటే బాగుండేదని కోర్టు అభిప్రాయపడింది. బాలుడికి జ‌రిగిన అన్యాయానికి క‌నీసం ఆర్థిక భ‌రోసా ఇవ్వాల‌ని చెప్పింది.
ఇందులో భాగంగా రూ.6ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని తీర్పు ఇచ్చింది. బాలుడు శారీరకంగా, మానసికంగా తీవ్రంగా దెబ్బతిన్నాడని కోర్టు గ్రహించిందనీ.. ఈ ఘటన అతని పసి మనసుపై బలమైన ముద్ర వేసే అవకాశం ఉందని స్ప‌ష్టం చేసింది. అత‌డికి జ‌ర‌గిన అన్యాయానికి ఏం చేసినా న్యాయం చేయ‌లేమ‌ని వివ‌రించింది. స‌మాజంలో అత‌డికి మాన‌వ‌తా దృక్ప‌థంలో అంద‌రూ అండ‌గా నిల‌వాల‌ని కోరింది. ఇక మీద‌ట బాధితుడికి మానసిక భద్రతను, సాధికారతా భావాన్ని కల్పించాల‌ని ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీని ఆదేశించింది. కోర్టు చేసిన ఈ వ్యాఖ్య‌లు ప్ర‌తి ఒక్క‌రి మ‌న‌సును ఆలోచింప‌జేస్తున్నాయి. ప‌సి మ‌న‌సుల‌ను గాయం చేస్తే వాటిని మాన్ప‌డం ఎంత క‌ష్ట‌మో ఈ తీర్పు ద్వారా కోర్టు తెలిపింద‌ని అర్థ‌మ‌వుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: