అత్తింటి వారిపై కోపం.. చేపల కూరలో స్లో పాయిజన్.. అసలు కథ తెలిస్తే షాకే..!
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వరుణ్ అరోరా(37) దక్షిణ ఢిల్లీవాసి. అతడికి కొన్నేళ్ల క్రితం దివ్య అనే మహిళతో వివాహం జరిగింది. అయితే, పెళ్లైన నాటి నుంచి తనను సరిగా పట్టించుకోవడంలేదనే అక్కసుతో వరుణ్ అత్తింటివాళ్లపై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరిలో చేపల కూర వండి, అందులో థాలియం కలిపాడు. వారింటికి వెళ్లి అందరికీ కూర వడ్డించి తినాల్సిందిగా కోరాడు.
ఈ క్రమంలో వరుణ్ అత్త అనితా దేవి, మరదలు ప్రియాంక మృతిచెందారు. అతడి భార్య దివ్య సైతం తీవ్ర అనారోగ్యం పాలుకావడంతో ఆస్పత్రిలో చేరింది. ఇక దివ్య తండ్రి మోహన్‌లో స్లో పాయిజన్ లక్షణాలు అంతగా కనిపించలేదు. ఇక అనిత, ప్రియాంక హఠాన్మరణాల నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా లోతుగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలో పగ తీర్చుకునేందుకు తానే చేపల కూరలో థాలియం కలిపానని, స్లో పాయిజన్ ద్వారా వారిని చంపడమే తన ఉద్దేశమని వరుణ్ అసలు విషయం బయటపెట్టాడు.
ఇక కుటుంబాన్ని చంపాలని వరుణ్ అరోరా నిర్ణయం తీసుకోవడానికి వెనుక గల కారణం తెలుసుకుని పోలీసులు సైతం విస్తుపోయారు. ఆరేళ్ల క్రితం వరుణ్ తండ్రి చనిపోయాడు. అదే సమయంలో వరుణ్ భార్య గర్భం దాల్చింది. తన తండ్రి మళ్లీ కొడుకు రూపంలో తనకు పుట్టబోతున్నాడని వరుణ్ నమ్మాడు. కానీ, గర్భంలో సమస్యలు తలెత్తడంతో వరుణ్ భార్య అబార్షన్ చేయించుకున్నారు.
అయితే ఆ అబార్షన్ వరుణ్‌కు ఇష్టం లేదు. భార్య, ఆమె తల్లిదండ్రులు తన మాట వినలేదనే కోపం ఏళ్లు గడిచినా అతడిని వెంటాడింది. ఇద్దరు కవల పిల్లలు పుట్టిన తర్వాత కూడా కోపం చల్లారలేదు. విచక్షణ మరిచి ఘాతుకానికి ఒడిగట్టాడు. మంగళవారం రాత్రి పోలీసులు వరుణ్‌ని అరెస్ట్ చేశారు.కాగా ఫోరెన్సిక్ రిపోర్టులు, వరుణ్ ఇంట్లో దొరికిన ఆనవాళ్ల ఆధారంగా పోలీసులు మంగళవారం అతడిని అరెస్టు చేశారు.