పానకం, వడపప్పు తయారీ విధానం ఎలానో తెలుసుకోండి . !!

Suma Kallamadi
శ్రీరామ నవమి రోజున పానకం – వడపప్పును భక్తులకు ప్రసాదంగా అందిస్తారు.ఈ పండగ రోజున పానకం, వడపప్పును ప్రసాదంగా పెట్టడం అనేది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్నది. పానకం – వడపప్పును ప్రసాద రూపంలో సేవించడం వల్ల ఆరోగ్యం, ఆయుష్షుతో పాటు అలసట తీరుతుందని పండితుల అభిప్రాయం. ఈ రుతువులో వచ్చే గొంతువ్యాధులకు, పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని కలిగిస్తాయని, ఔషధంగా పని చేస్తాయని అంటారు. మరి శ్రీ రామ నవమి స్పెషల్ వంటకం అయిన పానకంను ఎలా తయారు చేయాలో చూద్దామా.. !

కావాల్సిన పదార్థాలు :


బెల్లం- 3 కప్పులు,
మిరియాల పొడి- 3 టీ స్పూన్లు,
ఉప్పు- చిటికెడు,
శొంఠిపొడి- టీ స్పూన్‍,
నిమ్మరసం- 3 టీ స్పూన్లు,
యాలకుల పొడి- టీ స్పూన్‍,
నీరు- 9 కప్పులు.
పానకం తయారు చేసే విధానం:
ముందుగా ఒక గిన్నెలోకి  బెల్లాన్ని తీసుకుని మెత్తగా దంచి, నీళ్లలో కలపాలి. బెల్లం మొత్తం కరిగాక, పలుచని క్లాత్‍తో వడకట్టాలి. ఇందులో మిరియాల పొడి, శొంఠిపొడి, ఉప్పు, యాలకుల పొడి, నిమ్మరసం వేసి బాగా కలపాలి. అంతే పానకం తయారు అయిపోయినట్లే..
వడపప్పు తయారీకి కావలిసిన పదార్దాలు :
ఒక కప్పు పెసరపప్పు
ఒక పచ్చి మిర్చి
తగినంత ఉప్పు
తయారీ విధానం :
ముందుగా ఒక కప్పు పెసరపప్పును శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత 3 నుంచి 4 గంటల పాటు నీళ్లల్లో దానిని వేసి నానబెట్టాలి. ఇప్పుడు నీటిని పక్కకు తీసేసి పప్పుని ఒక గిన్నెలో వేసి దానిలో పచ్చి మిర్చి, ఉప్పు వేసి కలపాలి. అంతే వడపప్పు తయారైపోయింది.
పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి చలువ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక అయిన పెసరపప్పును ‘వడ’ పప్పు అంటారు. అంటే, మండుతున్న ఎండల్లో వడదెబ్బ కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని దీనిని ‘వడపప్పు’ అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: