నోరూరించే మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేయాలో తెలుసుకోండి.. !!
కావలసిన పదార్థాలు:
మామిడికాయ- 2
పసుపు- 1/4 టీ స్పూను
ఎండుమిర్చి- 5 లేదా కారం
ఉప్పు- 1టీ స్పూను
వేగించిన మెంతుల పొడి- 1 టీ స్పూను
నువ్వుల నూనె- 1/2 కప్పు
ఆవ పిండి - 1 టీ స్పూను
ఇంగువ- చిటికెడు
ఉప్పు- రుచికి సరిపడా
పోపు దినుసులు - సరిపడా
కరివేపాకు - 2 రెమ్మలు
తయారీ విధానం:
ముందుగా మామిడికాయను కడిగి తడి లేకుండా శుభ్రం తుడవాలి.తర్వాత మామిడికాయను చెక్కుతీసి, చిన్న చిన ముక్కలుగా తరుగుకోవాలి. తరువాత ఒక బాణలిలో ఎండుమిర్చిని రెండు నిమిషాలపాటు నూనె లేకుండా వేగించి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడిచేయాలి. తరువాత మామిడి ముక్కలు, పసుపు కూడా వేసి కచ్చాపచ్చాగా(మెత్తగా కాకుండా) రుబ్బుకోవాలి. ఎండుమిర్చి వద్దు అనుకుంటే కారం కూడా వేసుకోవచ్చు. మిక్సీలోనే మామిడికాయ ముక్కలతో పాటు కారం వేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తరువాత ఒక బాణలో నూనె వేడిచేసి పోపు దినుసులు వేసి అవి వేగాక దానిలో కొంచెం ఇంగువ వేయాలి.తరువాత ముందుగా రుబ్బి ఉంచుకున్న మామిడి తొక్కు వేసి సన్నని మంట మీద కలుపుతూ వేగించాలి. నూనె తేలుతున్నప్పుడు మెంతిపిండి, ఆవపిండి వేసి బాగా కలిపి మరో నిమిషం ఉడికించాలి. ఆ తరువాత ఉప్పు వేసి రెండు నిమిషాలు ఉడికించాక దింపేయాలి. అంతే మామిడికాయ పచ్చడి రెడీ. ఇది ఆరు నెలలపాటు నిలువ ఉంటుంది కూడా.. !!