భారతదేశంలో ప్రతి వ్యక్తికి పాన్ కార్డ్ అవసరం. బ్యాంకు లావాదేవీలైనా, పన్ను చెల్లింపులకు సంబంధించిన అంశాలైనా పాన్ కార్డ్ ఖచ్చితంగా అవసరం పడుతుంది. సాధారణంగా, ప్రింటింగ్, పోస్టేజీ, మాన్యువల్ హ్యాండ్లింగ్ కారణంగా భౌతిక పాన్ కార్డ్ పొందడానికి కొంత సమయం పడుతుంది. ముఖ్యంగా లోన్లు పొందే క్రమంలో, బ్యాంకు లావాదేవీలు నిర్వహించే క్రమంలో మీ వద్ద ఖచ్చితంగా పాన్ కార్డు ఉండాలి. ఒక వేళ పాన్ కార్డు ఎక్కడైనా మర్చిపోయినా, పోగొట్టుకున్నా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అయితే సులభంగా ఈ-పాన్ కార్డును తక్కువ సమయంలోనే పొందొచ్చు. కేవలం నిమిషాల వ్యవధిలోనే మీరు ఈ-పాన్ పొందొచ్చు. దానికి సంబంధించిన విషయాలిలా ఉన్నాయి.
ఆధార్ నంబర్ సాయంతో ఈ-పాన్ జారీ చేయబడుతుంది. ఈ-పాన్ పీడీఎఫ్ రూపంలో వినియోగదారులందరికీ జారీ చేయబడుతుంది. ఇది పూర్తిగా ఉచితం. ఇ-పాన్ అనేది డిజిటల్‌గా సంతకం చేయడిన పాన్ కార్డ్. ఇది ఆధార్ ఈ-కేవైసీ ఆధారంగా ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో జారీ చేయబడింది. పన్ను చెల్లింపుదారులందరికీ ఈ సౌకర్యం స్పష్టంగా అందుబాటులో ఉంటుంది. ఎవరికైనా ఫిజికల్ పాన్ కార్డ్ లేకపోయినా ఆధార్ ఉంటే వారు ఈ-పాన్ పొందవచ్చు. ఈ సేవతో వినియోగదారులు ఎటువంటి డబ్బు చెల్లించకుండా ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్ సహాయంతో ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో డిజిటల్ సంతకం చేసిన పాన్ కార్డ్‌ను పొందవచ్చు.
ఇది కాకుండా, మీరు మీ ఆధార్ ఈ-కేవైసీ ప్రకారం పాన్ వివరాలను కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా మీరు ఆదాయపు పన్ను అధికారిక వెబ్సైట్ https://www.incometax.gov.in/iec/foportal/కి వెళ్లాలి. దీని తర్వాత ఇ-ఫైలింగ్ పోర్టల్ హోమ్‌పేజీపై క్లిక్ చేసి, ఇన్స్టంట్ ఈ-పాన్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ-పాన్ పేజీలో గెట్ న్యూ ఈ-పాన్‌పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మరొక కొత్త ఈ-పాన్ పేజీని పొందుతారు. ఇక్కడ మీరు 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి. దీని తర్వాత కన్ఫర్మ్ చెక్‌బాక్స్‌ని ఎంచుకుని, కంటిన్యూపై క్లిక్ చేయండి. దీని తర్వాత ఓటీపీ కన్ఫర్మేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ కనిపించే బాక్స్‌లో టిక్ మార్క్ చేయాలి. ఓటీపీ ధ్రువీకరణ పేజీలో, మీరు మీ ఆధార్‌కి లింక్ చేసిన మొబైల్ నంబర్లో అందుకున్న 6 అంకెల OTPని నమోదు చేయాలి. దీని తర్వాత, UIDAIతో ఆధార్ వివరాలను ధృవీకరించడానికి చెక్‌బాక్స్‌ని ఎంచుకుని, ఆపై కంటిన్యూపై క్లిక్ చేయండి. ఇప్పుడు చెల్లుబాటు అయ్యే ఆధార్ వివరాల పేజీపై క్లిక్ చేసి, ఐ యాక్సెప్ట్ చెక్‌బాక్స్‌ను టిక్ చేయాలి. తర్వాత కంటిన్యూపై క్లిక్ చేయండి. తర్వాత రసీదు సంఖ్యతో కూడిన సందేశం మీ ముందు కనిపిస్తుంది. అలా ఈ-పాన్ పీడీఎఫ్ సైతం మీకు డౌన్ లోడ్ అవుతుంది.