యువతకు గుడ్ న్యూస్.. స్పెషల్ పాలసీ తెచ్చిన ఎల్ఐసీ?
ప్రతి ఒక్కరికీ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఎంతో ముఖ్యం. జీవితంలో ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఆపద వచ్చినా పాలసీ కుటుంబాలకు ఓ భరోసాను ఇస్తుంది. ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేస్తుంది. అటువంటి బీమా ఇచ్చే సంస్థల్లో ముఖ్యంగా మనకు వినపడే పేరు ఎల్ఐసీ. ఈ పాలసీ విడుదల చేసే అన్ని పాలసీలకు ప్రజల నుంచి ఆదరణ ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి. తాజాగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. యువత కోసం ప్రత్యేక పాలసీని తీసుకొచ్చింది.
యువ టర్మ్, డీజీ టర్మ్, యువ క్రెడిట్ లైఫ్, డీజీ క్రెడిట్ లైఫ్ పేరుతో ఎల్ఐసీ ఆ పాలసీలను తీసుకొచ్చింది. ఈ పాలసీలు ఆగస్టు నెల 5వ తేది నుంచే అమల్లోకి వచ్చేశాయి. ప్రత్యేకంగా యువకుల కోసం ఈ పాలసీని ఎల్ఐసీ తెచ్చింది. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి దురదృష్టవశాత్తూ చనిపోతే అతని కుటుంబానికి లోన్ రీపేమెంట్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఈ పాలసీల్లో యువటర్మ్, యువ క్రెడిట్ లైఫ్ బీమా ప్లాన్లను ఎల్ఐసీ ఏజెంట్ల ద్వారానే తీసుకోవాల్సి ఉంటుంది. డీజీ టర్మ్, డీజీ క్రెడిట్ లైఫ్ ప్లాన్లను ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు.
18 నుంచి 45 ఏళ్ల వారు ఈ పాలసీలను తీసుకోవచ్చని ఎల్ఐసీ ప్రకటించింది. ఈ పాలసీ మెచ్యూరిటీ వయసు చూస్తే 33 నుంచి 75 ఏళ్ల వరకూ ఉంది. బీమా మొత్తం తక్కువలో అంటే రూ.50 లక్షలు ఉంది. ఇక గరిష్టంగా చూసినట్లైతే రూ.5 కోట్ల వరకూ ఎల్ఐసీ అందిస్తోంది. ఎల్ఐసీ కట్టుకోవడానికి రెగ్యులర్, సింగిల్ ప్రీమియంలు కూడా అందుబాటులో ఉంటాయని ఎల్ఐసీ తెలిపింది. పాలసీ తీసుకున్న కాలానికి మాత్రమే బీమా ఉంటుంది. ఒక వేళ గడువు తీరిపోతే ఆ తర్వాత ఎటువంటి బెనిఫిట్లు ఉండవని ఎల్ఐసీ తేల్చి చెప్పింది. యువతలో ఎక్కువ మంది ఇల్లు, వాహనం, చదువు కోసం రుణాలను తీసుకుంటూ ఉంటారు. ఒక వేళ ఎల్ఐసీ క్రెడిట్ లైఫ్ ఫ్లాన్లు తీసుకున్న వ్యక్తి చనిపోతే అతని రుణాలను కుటుంబీకులు చెల్లించాల్సిన అవసరం లేదని ఎల్ఐసీ స్పష్టం చేసింది.