రోజుకు రూ.1,000 కోట్లు సంపాదిస్తున్న అదానీ?

Chakravarthi Kalyan
గౌతమ్ అదానీ.. ఓ గుజరాతీ వ్యాపారవేత్త.. ఇప్పుడు మన దేశంలో అత్యంత వేగంగా డబ్బు సంపాదిస్తున్న వ్యాపారవేత్త ఎవరైనా ఉన్నారంటే అది గౌతమ్ అదానీయే.. కొన్ని సంవత్సరాలుగా ఆయన సంపద అమాంతం పెరిగిపోతోంది. దేశంలోని కుబేరుల జాబితాలో ఆయన త్వరత్వరగా పైకి పాకుతున్నాడు. ఎప్పటి నుంచో ఇండియాలో అపర కుబేరులుగా ఉన్న అంబానీ, టాటాలతోనూ ఆయన పోటీపడుతున్నాడు. ఈ జోరు ఇలాగే కొనసాగితే ఆయన దేశంలోనే టాప్‌ కుబేరుడుగా మారేందుకు ఎక్కువ సమయం అవసరంలేదు. హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ తాజాగా విడుదల చేసిన లెక్కల ప్రకారం ఆయన కంటే ఆసియాలోధనవంతుడు ఒక్క ముకేశ్ అంబానీ మాత్రమే.

అవును మరి.. గౌతమ్ అదానీ సంపద ఒక్క ఏడాదిలో రూ.3.67 లక్షల కోట్లు పెరిగిందంటే నమ్మగలరా. అంతర్జాతీయ అగ్రగామి కుబేరుల కంటే ఈ పెరుగుదల రేటు చాలా ఎక్కువ. అయితే ఇప్పటి వరకూ ఇండియాలో టాప్ వన్ పొజిషన్ మాత్రం ఇంకా ముకేశ్‌ అంబానీదే. హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ తాజాగా విడుదల చేసిన లెక్కలపై ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఈ జాబితా ప్రకారం  ఆసియా కుబేరుల్లో గౌతమ్ అదానీ రెండో స్థానంలో ఉన్నారు. ఆయన తన గతేడాది  సంపదకు ఏకంగా 49 బిలియన్‌ డాలర్ల అంటే.. మన రూపాయల్లో 3.67 లక్షల కోట్ల అన్నమాట.. యాడ్ చేశారు.

ఈ లెక్కను బట్టి చూస్తే.. ఏడాదిలో ఆయన సంపాదించిన సగటు లెక్కేస్తే.. రోజుకు గౌతమ్ అదానీ కనీసం రూ.1,000 కోట్లు సంపాదించారని తేలుతోంది. 2022 ఎమ్‌3ఎమ్‌ హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ లో టాప్ పొజిషన్‌లో ఉన్న ఎలాన్‌ మస్క్‌, జెఫ్‌ బెజోస్‌, బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ కంటే అదానీ ఎక్కువ సంపాదించడం విశేషం.

ప్రధానిగా మోడీ వచ్చిన తర్వాతే గౌతమ్ అదానీ ప్రభ వెలగడం ప్రారంభమైందని.. ఆయనకు అనుకూలంగా మోడీ సర్కారు అనేక నిర్ణయాలు తీసుకుందన్న విమర్శలు ఉన్నాయి. ఎన్ని ఉన్నా.. ఈ స్థాయిలో సంపాదన పెంచుకోవడం మాత్రం అందరికీ షాక్ ఇస్తోంది. మరి ఈ గౌతమ్ అదానీ ముందు ముందు ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: