మారుతిసుజుకీకి మరోసారి.. దెబ్బ..!

Chandrasekhar Reddy
భారత దేశంలో దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ వినియోగదారుల భద్రత గురించి పట్టించుకున్న పాపాన పోలేదని ఇప్పటికే ఎంతోమంది తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ సంస్థ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందాన దేశంలోనే అతి పెద్ద కార్ల సంస్థ అయిన మారుతీ సుజుకీ తయారవుతుందని అందరు అంటున్నారు. ఈ సంస్థ కార్ల ఆక్యుపెంట్ సేఫ్టీ ప్రతిసారి ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ కార్ల లో ప్రయాణించే ప్రయాణికుల భద్రత శూన్యం అన్నట్లు రేటింగ్ సంస్థలు కూడా ఎప్పటికప్పుడు చెపుతూనే ఉన్నాయి. గ్లోబల్ ఎన్‌సీఏపీ సంస్థ పరీక్షించిన మారుతీ కార్లలో చాలా వరకు కార్లు మూడు స్టార్స్ లేదా అంతకంటే తక్కువ స్కోర్‌ లనే సాధించాయి. దీనితో వారి బ్రాండ్ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడుతోంది. కఠినమైన పరిమితుల తో క్రాష్ టెస్ట్‌ల ద్వారా పరీక్షించినప్పుడు మారుతీ కార్ల పరిస్థితి మరింత అధ్వానంగా ఉన్నట్టు తేలింది.

తాజాగా మారుతీ సుజుకీ స్విఫ్ట్ లాటిన్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో సున్నా స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను అందుకుంది. అది మరిచి పోకముందే ఆ సంస్థ మరో కారు సుజుకీ బాలెనో కూడా లాటిన్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో సున్నాస్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. ఇంకా విస్తుపోయే విషయం ఏమిటంటే, లాటిన్ అమెరికాలో విక్రయించే ఈ మోడల్ కారును భారతదేశంలోనే తయారు చేశారు. ఇది ఇండియన్ మోడల్‌తో దాదాపు సమానంగా ఉండటం గమనార్హం. మారుతీ సుజుకీ బాలెనో పెద్దవారి భద్రతా లేదా అడల్ట్ ఆక్యుపెంట్ విభాగంలో 8.01 పాయింట్లు (20 శాతం) సాధించింది. ఈ టెస్ట్‌లో అంచనా వేసినట్లుగా డ్రైవర్, ప్రయాణీకుల తల, మెడకు సమర్థవంతమైన రక్షణ ఇవ్వగలిగింది సంస్థ. ప్రయాణికుల ఛాతీ భాగానికి కూడా దాదాపుగా మంచి రక్షణ అందించింది. ఇంకా ఫుట్‌వెల్, బాడీషెల్ భాగాలు స్థిరమైన రేటింగ్ పొందాయి. అంటే ఇది తదుపరి లోడింగ్‌లను తట్టుకోగలదు అన్నమాట. లాటిన్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో బాలెనో కారు స్విఫ్ట్ మోడల్ కంటే కాస్త పరవాలేదని స్పష్టమైంది. కానీ సున్నా స్టార్ రేటింగ్‌కి ప్రధాన కారణం సైడ్ ఇంపాక్ట్ విషయంలో సరైన రక్షణ ఇవ్వడమే. డ్రైవర్, ముందు సీట్లో ప్రయాణీకులకు ఛాతీ రక్షణ సైడ్ ఇంపాక్ట్‌లో చాలా తక్కువగా ఉందని క్రాష్ టెస్ట్ నివేదిక తేల్చింది. సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ లో పొత్తికడుపు, తలకు రక్షణ బాగానే ఉందని క్రాష్ టెస్ట్ తో తేలింది.

సంస్థ యొక్క సుజుకీ బాలెనో పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో లాటిన్ ఎన్‌సీఏపీ టెస్టింగ్ లో 8.36 పాయింట్లను (17.06 శాతం) అందుకుంది. అంటే చాలా నాసిరకమైన స్కోర్ గా పరిగణిస్తారు. ఇక పాదచారుల రక్షణ విషయానికొస్తే, 30.75 పాయింట్లు (64.06 శాతం) సాధించింది. లాటిన్ ఎన్‌సీఏపీ పరీక్షించిన మోడల్‌లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, సీట్‌బెల్ట్ రిమైండర్, ఫ్రంట్ ప్రిటెన్షనర్లు, ఈబీడీ లాంటివి ఉన్నాయి. అయితే, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఆటో-ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ అసిస్ట్ సిస్టమ్, స్పీడ్ అసిస్ట్ సిస్టమ్ వంటి రక్షణ ఏర్పాట్లు లేకపోవడం వల్ల లాటిన్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో సుజుకీ బాలెనో స్కోరింగ్‌పై ప్రభావం తీవ్రంగా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: