పండుగ సీజన్‌లో టీఎస్‌ఆర్టీసీకి కాసుల వర్షం!
పండుగల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు తెలంగాణ, ఏపీలతో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు ప్రయాణం సాగించాయి. కాగా పండుగకు ముందు.. అంటే ఈనెల ఒకటో తేదీ నుంచి 7వ తేదీ వరకు రోజువారీ సగటు ఆదాయం రూ. 9.70 కోట్లుగా ఉండగా.. పండుగ రోజుల్లో సగటున రోజువారీ ఆదాయం రూ. 10.17 కోట్లకు చేరింది. ఈ పది రోజుల్లో మొత్తం 2.80 కోట్ల మంది ప్రయాణికులను చేరవేవేసింది టీఎస్‌ఆర్టీసీ. ఆక్యుపెన్సీ రేషియో 63.19గా నమోదైంది.
తెలంగాణ ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరగా.. ప్రత్యేక బస్సులతో రూ. 8 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే దసరా ప్రత్యేక బస్సుల ద్వారా రూ. 5 కోట్లు ఆదాయం రాబట్టాలని ముందుగా అధికారులు అంచనా వేశారు. కానీ అంచనా వేసిన దానికంటే రూ.3 కోట్లు అధికంగా వచ్చాయి. గతంలో పండుగల సందర్భంగా నడిపించే ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేసేవారు. దీంతో చాలా మంది ప్రయాణికులు సొంత, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించేవారు. కానీ ఈసారి మాత్రం ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ చార్జీలనే వసూలు చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులు ముందస్తుగానే ప్రకటించారు. అందుకే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం తిరుగు ప్రయాణంలోనూ ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిటకటలాడుతున్నాయి.
మరోవైపు రాష్ట్రంలోని అన్ని బస్టాండ్‌లలో అధిక ధరలకు తినుబండారాలు విక్రయిస్తున్న దుకాణాలపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన దుకాణదారులకు నోటీసులు పంపారు. అలాగే ఉచిత మరుగుదొడ్ల వద్ద ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేసిన వారికి కూడా జరిమానాలు విధించారు.