అందరి చూపు గ్రీన్ ఎనర్జీ వైపే

అందరి చూపు గ్రీన్ ఎనర్జీ వైపే  
భారత్ లోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, ఇంకా చెప్పాలంటే దిగ్గజాలుగా పేరుగాంచిన వారు ఇకపై గ్రీన్ ఎనర్జీ వైపు దృష్టి సారిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్టపట్నం  పోర్టును  ఇటీవల తన ఖాతాలో వేసుకున్న గౌతమ్ ఆదానీ పునరుత్పాదక విద్యుత్ పై దృష్టి సారిస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో పడవేశారు. జేపీ మోర్గాన్ ఇండియా ఇన్వెస్టర్ సమిట్ లో ఆదాని గ్రూపు చైర్మన్  హోదాలో గౌతమ్ ఆదాని కీలకోపన్యాసం చేశారు. రానున్న నాలుగైదేళ్లలో పునరుత్పాదక సామర్ద్యాన్ని మూడు రెట్లకు పైగా పెంచుతామని ప్రకటించారు. ఇందు కోసం తాము 20 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు తెలిపారు. హైడ్రోజన్ ఉత్పత్తిని పెంచనున్నట్లు ప్రకటించారు.  తమ అధీనంలోని పోర్టులన్నింటినీ  కాలుష్యరహితంగా మారుస్తామని తెలిపారు. తమ డేటా కేంద్రాలన్నింటికీ పునరుత్పాదక విద్యుత్ సమకూరుస్తామని అన్నారు.  2025 వరకూ తమ పెట్టుబడుల్లో అంటే మూల ధన వ్యయంలో దాదాపు 75 శాతం వరకూ గ్రీన్ టెక్నాలజీ పైనే కేంద్రీకరిస్తామని చెప్పారు. విద్యుత్ విడి భాగాలు తయారు చేస్తామన్నారు వాటిని ప్రపంచ వ్యాప్తంగా సరఫరా చేస్తామన్నారు.2030 నాటికి తమ కంపెనీ ప్రపంచ దిగ్గజ కంపెనీ గా ఎదుగుతుందని, ఇందుకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్దం చేశామని  గౌతమ్ ఆదాని వివరించారు
ఆదాని గ్రూపు మీడియారంగంలోకి  ప్రవేశిస్తోందంటూ వచ్చిన వార్తలకు ఆయన ఊతమిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కోవిడ్-19 ని భారత్ సమర్ధవంతంగా ఎదుర్కొందని కితాబిచ్చారు. కొన్ని మీడియా సంస్థలు భారత్ పై బురదజల్లే ప్రయత్నాలు చేశాయని విమర్శించారు. దేశ ప్రతిష్ఠను దిగజారేలా వార్తా కథనాలు ప్రచురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు మంచిది కాదని గౌతమ్ ఆదాని పాత్రికేయులకు హితవు  పలికారు. పాత్రికేయ సమాజానికి స్వేచ్ఛ ఉంటుందని, అంత మాత్రాన ఏకపక్ష ధోరణితో ప్రజలను తప్పుదోవ పట్టించేలా కథనాలు ఉండకూడదని గౌతమ్ ఆదాని వ్యాఖ్యానించారు. ఆదాని ప్రసంగం ఆద్యంతం ఆసక్తి కరంగా సాగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: