సామాన్యులపాలిట గుదిబండగా మారబోతున్న నిత్యావసర ధరలు..!
ఈ కరోనా కాలంలో ఉపాధి లేక బతుకే భారమౌతున్న తరుణంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుకోవడం ఇపుడు పేద, మధ్య తరగతి వారి పట్ల గుదిబండగా మారుతోంది. దానికి తోడు వర్షాలు పడాల్సిన చోట పడక పోవడం వలన, రైతులు పంటలు పండించక పోవడం వలన కూడా దీనికి ఓ కారణమనే చెప్పవచ్చు. పట్నాల సంగతి ఎలా వున్నా, ఇపుడు పల్లెటూళ్లలో కూడా కాయగూరలను కొనలేక సామాన్యుడు అల్లాడిపోతున్నాడు.
ఇకపోతే, రోజురోజుకు పెరిగి పోతున్న డీజిల్ ధరలు, నిత్యావసరాల ధరలపై మరింత ప్రభావం చూపిస్తున్నాయి. ఎందువల్లనంటే... డీజిల్ తో ప్రయాణించే వాహనాలలో ఈ సరుకులు రవాణా చేయడం వలన, సరుకు రవాణా ఛార్జీల్ని 20 శాతం పెంచి, వినియోగదారుని పైనే రుద్దుతున్నారు. డీజిల్ అధిక ధరలే దీనికి కారణం అని నిపుణుల మాట. తద్వారా... ఆ ప్రభావం ద్రవ్యోల్బణం రేటు పైన స్పష్టంగా పడుతుంది.
ముఖ్యంగా... టమోటా ధరలు తీసుకుంటే... ఆకాశాన్నంటుతున్నాయి. అయితే దానికి కారణం పంట అందుబాటులో లేకపోవడం కూడాను. యెంత దిగుమతి తక్కువున్నా.. కేజీ టమోటా ధర 60 రూపాయిలు పలకడం సామాన్యుడిపైన పెనుభారమే అని చెప్పుకోవాలి. అదలా ఉంచితే... ఇతర కూరగాయల ధరలతో పాటు రోజువారీ వస్తువుల ధరలు కూడా రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దీని వలన పేదవారి సాధక బాధలు వర్ణనాతీతం.
సదరు ట్రక్ యూనియన్ మాట్లాడుతూ... ఇంధన ధర రోజు రోజుకీ పెరుగుతూ ఉంటే మేమేమి చేసేది. మేము కూడా సామాన్యులమే అంటూ తమ గోడు వెళ్లబుచ్చుతున్నారు. అందువలననే, ఛార్జీలను 20 శాతం పెంచాల్సి వస్తుందని వారు చెప్పడం గమనార్హం. డీజిల్ ధరల పెరుగుదల కారణంగా, సరుకు రవాణా పెరుగుదల మొత్తం దేశంపై ఒకేసారి కనిపిస్తుంది. ట్రక్ ఆపరేట్లు తీసుకోనున్న ఈనిర్ణయం ఎఫ్‌ఎంసిజి కంపెనీలపై సైతం ఒత్తిడిని పెంచుతుంది.