ఆ రెండు విలీనం అయితే జియో కథ కంచికేనా...?

Shyam Rao

టెలికాం ఇండస్ట్రీ మొత్తం తమ చెప్పుచేతల్లో నడవాలని భావిస్తున్న టెలికాం దిగ్గజం ఎయిర్టెల్కు, కొత్తగా మార్కెట్లోకి ఎంట్రీ అయిన జియోకు పెద్ద ముప్పు ఎదురుకాబోతుంది. భారత్‌ టెలికాం దిగ్గజం ఐడియాతో విలీనానికి చర్చలు జరుపుతున్నట్లు వొడాఫోన్‌ సోమవారం ప్రకటించింది. ఈ విషయాన్ని వొడాఫోన్ ఈ రోజు స్పష్టం చేసింది. ఆదిత్య బిర్లా గ్రూప్‌లో వొడాఫోన్‌కు చెందిన అన్ని షేర్లను కలిపేందుకు చర్చలు జరుపుతున్నట్టు పేర్కొంది.  గత కొన్ని రోజులుగా ఈ రెండు కంపెనీలు చేతులు కలుపబోతున్నాయని మార్కెట్లోనూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలను ధృవీకరిస్తూ వొడాఫోన్ సైతం ఓ ప్రకటన విడుదల చేసేసింది. 



వొడాఫోన్‌ ఇండియాను విడగొట్టేందుకు ఐడియా జారీ చేసే కొత్త వాటాలు తదితర అంశాలపై చర్చలు జరుపుతున్నట్లు దీనిలో పేర్కొంది. దీంతో వొడాఫోన్‌ షేర్లు 3.5 శాతం పెరిగాయి. బ్రిటిష్ కంపెనీ అయిన వొడాఫోన్, అదిత్యా బిర్లా గ్రూప్‌కు చెందిన ఐడియా ప్రస్తుతం భారత్‌లో వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. రెండు దిగ్గజాలు కలవడం ద్వారా భారత మార్కెట్లో నంబర్ వన్ స్థానంలో ఉన్న భారతీ ఎయిర్‌టెల్‌తోపాటు సంచలన ఆఫర్లతో దూసుకుపోతున్న రిలయన్స్ జియోను వెనక్కి నెట్టాలన్నది ఐడియా ఆలోచన.



 వొడాఫోన్‌కు ఐడియా కొత్త‌గా షేర్లు జారీ చేస్తేనే ఈ విలీనం జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టంచేసింది. అయితే క‌చ్చితంగా ఈ విలీనం ఎప్పుడు ఉంటుంద‌న్న విష‌యం మాత్రం వెల్ల‌డించ‌లేదు. ఈ విలీనంతో రెండు కంపెనీల సంస్థ సబ్స్క్రైబర్ సంఖ్య 39 కోట్లకు ఎగబాకనుంది. ఇది ఎయిర్టెల్కున్న  27 కోట్ల కంటే ఎక్కువ. జియోకు ప్రస్తుతం 7.2 కోట్ల మంది సబ్స్క్రైబర్లు మాత్రమే ఉన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: