రెడ్డి ల్యాబ్స్.. ఫార్మా రంగంలో తెలుగువారి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన సంస్థ. తెలుగు రాష్ట్రాల్లో ఫార్మారంగం ఎదుగుదలకు పునాదులు వేసి మార్గదర్శకంగా నిలిచిన సంస్థ.. ఎన్నెన్నో జాతీయ, అంతర్జాతీయ విజయాలు అందుకున్న సంస్థ.. ఎందుకనో కొన్ని నెలలుగా తన ప్రతిష్టను మసకబార్చుకుంటోంది.
వరుస దెబ్బలతో రెడ్డీ ల్యాబ్స్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అమెరికా మార్కెట్ లో అమ్మకాలు తగ్గిపోయాయి. మరోవైపు వెనిజులాలో వ్యాపారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఈ కారణాలతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ నికర లాభం భారీగా తగ్గింది. 80 శాతం మేర త్రైమాసిక లాభం క్షీణించింది. గత ఏడాది కంపెనీ 625.7 కోట్ల నికర లాభాన్ని ఆర్జించగా....2016-17 సంవత్సరం మొదటి మూడు నెలలకే...80 శాతం క్షీణించి 126.3 కోట్లకు పరిమితమైంది.
గత ఏడాది నికర లాభం 16.6 శాతం ఉంటే ఈసారి 3.9 శాతానికి పడిపోయిందని కంపెనీ వెల్లడించింది. 2016 ఏప్రియల్- జూన్ నెలలకు రెడ్డీస్ ఏకీకృత ఆదాయం 3,234.5 కోట్లుగా ఉంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసిక ఆదాయం 3757.8 కోట్లతో పోలిస్తే....14 శాతం తగ్గింది. గ్లోబెల్ జనరిక్స్ వాటా 14 శాతం క్షీణించి 3,096.1 కోట్ల నుంచి 2663.8 కోట్లకు పరిమితమైంది.
కంపెనీకి ప్రధాన మార్కెట్ అయిన ఉత్తర అమెరికాలో జనరిక్స్ అమ్మకాలు 16 శాతం క్షీణించాయ్. ఏడాది క్రితం ఇదే కాలంలో 1,851.6 కోట్ల విలువైన జనరిక్స్ ను ఈ విఫణిలో విక్రయించగా ఈసారి మాత్రం 1552.3 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రధానంగా వాల్గాన్ సి క్లోవిర్, అజాన్ సిటిడైన్ ఔషథాలకు పోటీ పెరిగి, ధరలపై ఒత్తిడి రావడం, అమ్మకాలు తగ్గడం .... ఉత్తర అమెరికా అమ్మకాలు క్షీణించడానికి కారణమని కంపెనీ వెల్లడించింది.