బాధితులకు నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన వైసీపీ ప్రజాప్రతినిధులు..!

FARMANULLA SHAIK
ఇటీవల భారీ వర్షాలు వచ్చి ఏర్పడిన వరదలతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా నష్టపోయారు. ముఖ్యంగా విజయవాడ, ఖమ్మంలో అనేక ప్రాంతాలు నీట మునిగి ప్రజలు ఇబ్బంది పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల కోసం ఇప్పటికే అనేకమంది టాలీవుడ్ హీరోలు, ప్రముఖులు ముందుకొచ్చి రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి భారీగా విరాళాలు ఇచ్చారు. ఈ క్రమంలోవరద బాధితుల కోసం వైసీపీ నేతలు భారీ విరాళం ప్రకటించారు. వైయస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెల జీతం విరాళం ప్రకటించారు. విజయవాడ వరద బాధితుల కోసం వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మరిన్ని అడుగులు ముందుకేసింది. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు, లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల జీతాన్ని విరాళంగా ఇవ్వనున్నారు. పార్టీ చేపట్టనున్న వరద బాధిత సహాయ కార్యక్రమాలకు ఈ విరాళాన్ని వినియోగించనున్నారు.పార్టీ తరఫున ఇదివరకే కోటి రూపాయల సహాయాన్ని వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. దాన్ని వినియోగించి వరద బాధితుల కోసం పాల ప్యాకెట్లు, వాటర్‌ బాటిళ్లు పెద్ద ఎత్తున పంపిణీ చేశారు. ఇంకా బాధితుల అవసరాలు గుర్తించి, సరుకులు పంపిణీ చేస్తామని పార్టీ ప్రకటించింది. ఆ సహాయ కార్యక్రమాలకు తోడు, ఇప్పుడు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రటించిన విరాళం అదనం కానుంది.మొత్తంగా సర్వం కోల్పోయిన బాధితులకు అండగా నిలిచేందుకు పలు చేతులు ముందుకు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు ఏపీ వరద బాధితులకు సాయాన్ని ప్రకటిస్తున్నారు. వరద ప్రభావిత ప్రజలను ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో విరివిగా విరాళాలు అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు కూడా పిలుపునిచ్చారు. ఈ పిలుపుకు స్పందించిన అనేకమంది విరాళాలిచ్చేందుకు ముందుకొస్తున్నారు.దాతలు విరాళాలు అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బ్యాంకు ఖాతా నెంబర్ ను, అదేవిధంగా డిజిటల్ ప్లాట్ఫామ్ క్యూఆర్ కోడ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటి ద్వారా ఎవరైనా సహాయం అందించి వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు అండగా నిలవచ్చని తెలిపింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: