తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున వరదల కారణంగా తెలుగు రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చాలా మంది ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. వాహనాలు, పశు సంపద అంతా వర్షాలకు కొట్టుకుపోయింది. రైతులకు ఈ వరదలు తీవ్ర నష్టం కలిగించాయి. తెలంగాణలో ముఖ్యంగా ఖమ్మం జిల్లా తీవ్రంగా నష్టపోయింది. ఇక ఏపీలో అయితే ఉమ్మడి కృష్ణా జిల్లా భారీ నష్టాన్ని చవిచూసింది. పదుల సంఖ్యలో ప్రాణ నష్టం కూడా వాటిల్లింది. మొత్తంగా ఏపీ, తెలంగాణలు కోలుకోలేని నష్టాన్ని చవిచూశాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని సాయం కోరుతూ లేఖ రాశారు. ఏపీ సైతం కేంద్రం సాయం కోరాయి. ఈ నేపథ్యంలో నిన్న విజయవాడ సహా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం... ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు, మంత్రులు, రాష్ట్ర అధికారులతో అర్థరాత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమావేశమయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గురువారం రాత్రి ఆయన విజయవాడ కలెక్టరేట్ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. వరద నష్టం అంచనాలు అందగానే కేంద్ర ప్రభుత్వం తన వంతు సాయం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి అవసరమైన అన్నిరకాల సహాయ సహకారాలను అందిస్తారన్నారు. వరదలతో నష్టం భారీగా జరిగిందని, పంటలు కూడా బాగా దెబ్బతిన్నాయని, రైతులు చాలా నష్టపోయారని చెప్పారు. రాష్ట్రానికి పూర్తి మద్దతును కేంద్రం అందిస్తుందని భరోసా ఇచ్చారు.ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. వరద బాధితుల తక్షణ సహాయక చర్యల కింద తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. రెండు రాష్ట్రాలకు కలిపి రూ.3300 కోట్ల తక్షణ ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. భారీ వర్షాలు, వరదల వలన తీవ్రంగా నష్టపోయిన ఏపీలోని విజయవాడ, తెలంగాణ లోని ఖమ్మం ప్రాంతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గత రెండు రోజులుగా పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేశారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఫోన్ చేసి.. రెండు రాష్ట్రాలను అన్నిరకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తక్షణ సహాయక చర్యల నిమిత్తం ఈ మొత్తాన్ని ప్రకటించినట్టు తెలుస్తోంది.