తెలంగాణ: మహిళల ఫ్రీ జర్నీపై స్పందించిన పోలీసులు..?

FARMANULLA SHAIK
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని మహిళలు వందకు వంద శాతం వినియోగించుకుంటున్నారు. ఈ పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి మహిళలు పెద్ద ఎత్తున బస్సు ప్రయాణాలు చేస్తున్నట్టు ఆర్టీసీ యాజమాన్యం చెప్తోంది. అయితే.. హైదరాబాద్‌ నగరంలోని సిటీ బస్సుల్లో కూడా మహిళలు పెద్ద ఎత్తున ప్రయాణాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. రాత్రి వేళ మహిళలకు హైదారబాద్ పోలీసులు ఫ్రీ జర్నీ అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంపై పోలీసులు స్పందించారు.రాత్రి 10 నుంచి ఉదయం 6 మధ్య పోలీసులకు ఫోన్ చేస్తే.. మహిళలను ఇంటి వద్ద ఉచితంగా దించుతారని.. 1091, 7837018555 నంబర్‌కి ఫోన్ చేస్తే చాలు.. స్థానిక పెట్రోలింగ్ పోలీస్ వాహనం వచ్చి తీసుకెళ్తుందంటూ వాట్సప్‌, ఇన్‌స్టాగ్రాంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా.. ఈ ప్రచారంపై స్పందించిన హైదరాబాద్ పోలీసులు.. ఇదంతా ఫేక్ ప్రచారమని స్పష్టం చేశారు. ఆ వార్తలను పూర్తిగా ఖండించారు. ఇలాంటి మెసేజ్‌లతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఉచిత రవాణా సౌకర్యం పేరిట తప్పుడు ప్రచారం జరుగుతోందని పోలీసులు స్పష్టం చేశారు. ఇలాంటి పుకార్లు ఎవరూ నమ్మవద్దని తెలిపారు. ఏదైనా వార్త షేర్ చేసే ముందు.. దాన్ని ధ్రువీకరించుకోవాలని సూచించారు.
సాధారణంగా అయితే.. రాత్రి సమయంలో ఎక్కువగా ఆర్టీసీ బస్సులు ఉండకపోవటంతో.. ఉద్యోగాలకు వెళ్లిన మహిళలను ఆయా సంస్థలకు చెందిన వాహనాల్లోనే ఇంటి వద్ద జాగ్రత్తగా దింపుతుంటారు. అయితే.. ప్రయాణాలు చేసిన వచ్చిన మహిళలు, వీధి వ్యాపారాలు చేసుకునే మహిళతో పాటు పనుల మీద బయటికి వెళ్లిన వాళ్లు మాత్రం ఇళ్లకు చేరుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి.కొందరు మహిళలు మాత్రం క్యాబ్‌లు, ఆటోల్లో వెళ్తుంటారు. అయితే.. రాత్రి సమయంలో అత్యధిక ఛార్జీలు వసూలు చేయటమే కాకుండా.. ప్రయాణాలు కూడా అంత సురక్షితం కాదన్న భావన ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: