సీఎం వైఎస్ జగన్‌పై సీబీఐ, ఈడీ కేసులను వచ్చే ఎన్నికల్లోగా తేల్చాలని కోరుతూ మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య హైకోర్టుకు వెళ్లారు. రానున్న ఎన్నికల్లో నేర చరిత్ర లేని ముఖ్యంగా సీబీఐ, ఈడీ కేసులు లేని వారిని ఎన్నుకోవాలని ఏపీ ఓటర్లు కోరుకుంటున్నారని హరిరామ జోగయ్య తన పిల్‌లో పేర్కొన్నారు. జగన్‌పై సీబీఐ, ఈడీ కేసుల విచారణ వెంటనే చేపట్టేలా సీబీఐ కోర్టును ఆదేశించాలని కోరుతూ హరిరామ జోగయ్య ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రోజువారీ విచారణ జరిపి వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల్లోగా కేసులను తేల్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని హరిరామ జోగయ్య కోరారు.
అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయ్యారని.. కేసులు పెండింగులో ఉండగానే రానున్న ఎన్నికల్లోనూ పోటీకి జగన్ సిద్ధమవుతున్నారని హరిరామ జోగయ్య అన్నారు. అయితే.. జగన్ వ్యక్తిగత కేసులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం పరిధిలోకి ఎలా వస్తాయంటూ హైకోర్టు రిజిస్ట్రీ హరిరామ జోగయ్య పిల్ పై అభ్యంతరం వ్యక్తం చేసింది. హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరాలపై విచారణను కోర్టు జులై 6కి వాయిదా వేసింది.