ప్రముఖ నటుడు కృష్ణంరాజు ఈ తెల్లవారుజామున హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో కన్నుమూశారు. కృష్ణంరాజు మరణానికి కారణాన్ని ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. దాని ప్రకారం.. 82 ఏళ్ల కృష్ణంరాజు సుగర్, పోస్ట్ కోవిడ్, తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్ కారణంగా చనిపోయారు. కృష్ణంరాజుకు గుండె కొట్టుకునే వేగంతో కొంతకాలంగా సమస్య ఉంది. రక్తప్రసరణ కూడా సరిగా లేదు. కృష్ణంరాజుకు ఏడాది క్రితం కాలికి శస్త్రచికిత్స కూడా జరిగింది. చాలా కాలంగా కృష్ణంరాజు మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్య కూడా ఉన్నాయి. కోవిడ్ తర్వాత సమస్యతో కృష్ణంరాజు గత నెల 5వ తేదీన ఐఐజీ ఆస్పత్రిలో చేరారు.
మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా వల్ల కృష్ణంరాజుకు ఊపిరితిత్తుల్లో తీవ్ర న్యుమోనియా వచ్చింది. కిడ్నీ పనితీరు కూడా పూర్తిగా దెబ్బతిన్నది. ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఆదివారం తెల్లవారుజామున 3.16గంటలకు కృష్ణంరాజుకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దానితోనే కృష్ణంరాజు మరణించారని ఆస్పత్రి ప్రకటనలో తెలిపింది.