ఇవాళ ఏపీకి చాలా కీలకమైన రోజు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశాలు, ఆర్థిక సంబంధిత విషయాలు, ఏపీకి పెండింగులో ఉన్న అంశాలపై ఈ మధ్యాహ్నం దిల్లీలో కీలక సమావేశం జరగబోతోంది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టివి సోమనాథన్ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ఇందులో ప్రధానికి సీఎం ఇచ్చిన వినతులు, పెండింగు అంశాల పరిష్కార మార్గాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని ఆదేశం మేరకు రాష్ట్ర అధికారులతో కేంద్ర అధికారుల బృందం ఈ భేటీ నిర్వహిస్తోంది.
ఈ మధ్యాహ్నం 3 గంటలకు నార్త్ బ్లాక్ లోని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్రం తరపున ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, దిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి విజయసాయిరెడ్డి హాజరుకాబోతునత్నారు. వీరితో పాటు పలు శాఖల అధికారులు హాజరుకానున్నారు.