కరోనా భారత్ లో పూర్తిగా అదుపులోకి వచ్చిందన్న భావన ఉంది. కానీ.. నిన్న దిల్లీలో ఒక్కరోజే 50 శాతం పెరిగిన కొత్త కేసులు రావడం కలకలం రేపుతోంది. దీంతో మళ్లీ దేశంలో 11 వేల ఎగువకు క్రియాశీల కేసులు చేరుకున్నాయి. ఇటీవల దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులో ఉంది. దేశ రాజధాని దిల్లీలో మాత్రం ఈ పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. అక్కడ 24 గంటల వ్యవధిలో 50 శాతం మేర అధికంగా కేసులు వచ్చాయి. అంతకు ముందురోజు దిల్లీలో 202 మందికి కరోనా సోకింది. తాజాగా ఆ సంఖ్య 299కి చేరింది. అంటే.. కొవిడ్ పాజిటివిటీ రేటు 0.5 శాతం నుంచి 2.70 శాతానికి పెరిగిందన్నమాట. అలాగే దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య కూడా స్వల్పంగా పెరిగింది. నిన్న 4.34 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. వారిలో 1,007 మందికి వైరస్ సోకింది. అంటే ముందురోజు కంటే ఏడు శాతం అధికంగా కేసులు వచ్చాయన్నమాట.