ఏపీ సీఎం జగన్ పరిపాలన తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా మండిపడ్డారు. ఆస్తులు జప్తు చేస్తామని కాకినాడ కార్పోరేషన్ వాహనంపై బోర్డు పెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్.. ప్రజల మంచి కోరి పరిపాలన చేస్తున్నట్లు ఏ కోశానా కనిపించడం లేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్ను కట్టకపోతే సామాన్లు పట్టుకుపోతామని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ట్రాక్టర్లు వేసుకొని తిరగడం ఏం సూచిస్తోందని పవన్ కల్యాణ్ మండిపడుతున్నారు. ఇది డెయిలీ ఫైనాన్స్ వ్యాపారం చేసుకొనేవాళ్ళ ఆలోచనలా ఉంది తప్ప.. ఓ మంచి ముఖ్యమంత్రి పాలనలా లేదని పవన్ మండిపడ్డారు.
ఏపీలో పన్ను వసూళ్ల విషయంలో ఇటీవల భిన్నమైన పోకడలు పోతున్నారు. కర్నూలులో పన్ను కట్టలేదని షాపుల ముందు చెత్త కూడా వేసి నిరసన తెలిపారు. కాకినాడలో పన్ను కట్టక పోతే షాపుల్లో సామాన్లు తీసుకెళ్తామని బెదిరించారని పవన్ అంటున్నారు.