2024 ఎన్నికల సమయానికి అస్త్ర శస్త్రాలు అన్నీ సిద్ధం చేసుకోవాలన్నది జగన్ ఆలోచన.ఆ ఆలోచనకు అనుగుణంగా తనని తాను సిద్ధం చేసుకుంటున్నారు. తననే కాదు చుట్టూ ఉన్నవారిని కూడా సిద్ధం కావాలని ఆదేశిస్తున్నారు. నిన్నటి వేళ శ్రీకాకుళం వచ్చిన సందర్భంగా మా ప్రాంతం నాయకులతో ఆయన భేటీ అయ్యారు. ముఖ్యంగా సీనియర్ నాయకులు ధర్మాన ప్రసాదరావుతో ఆత్మీయంగా ముచ్చటించారు. గత కొద్ది కాలంగా వీరిరువురికీ మధ్య గ్యాప్ ఉందని కొన్ని వార్తలు నడుస్తున్నాయి. అయితే అవి అభిప్రాయ భేదాలే అని తేలిపోయింది నిన్నటి వేళ. అదేవిధంగా త్వరలో ఆయనను క్యాబినెట్ లోకి తీసుకోనున్నారని ప్రాథమిక సమాచారం.అయితే ధర్మాన మాత్రం తనకు పదవి వద్దని అంటున్నారని సన్నిహితుల వద్ద కూడా ఇదే మాట చెబుతున్నారని కూడా తెలుస్తోంది. ఈ మాటల్లో నిజానిజాలు ఎంతన్నది త్వరలో తేలిపోనుంది. ఏదేమయినప్పటికీ త్వరలో జగన్ ప్లాన్ చేసే పొలిటికల్ యాక్షన్ టీంలో ధర్మానకు చోటిస్తారని ఓ ప్రాథమిక సమాచారం. ఆ విధంగా ఆయనకు సరైన గుర్తింపు ఇవ్వాలన్నది కూడా జగన్ యోచన. వీటిపై కూడా ధర్మాన నిరాసక్తతతో ఉంటారా లేదా ఆసక్తి కనబరుస్తారా లేదా ఎప్పటిలానే నైరాశ్యంతోనే కాలం వెళ్లదీస్తారా అన్నది ఇప్పుడిక ఓ ఆసక్తిదాయకం.