వ‌డ్డీతో స‌హా చెల్లిస్తాం: లోకేష్‌

Garikapati Rajesh

వైసీపీ దౌర్జన్యాలపై ప్రజలు తిరగబడే రోజు ద‌గ్గ‌ర‌లోనే ఉంద‌ని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిప‌డ్డారు. మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేయడాన్ని లోకేష్ తీవ్రంగా ఖండించారు. ప్ర‌తిప‌క్ష‌నేత ఇంటిపైకి నీ ఎమ్మెల్యేని, బులుగు గూండాల‌ని పంపావంటేనే నీ దిగజారుడుతనం అర్థమవుతోందంటూ ముఖ్య‌మంత్రి జ‌గన్‌పై నిప్పులు చెరిగారు. జగన్ రోజురోజుకూ అధఃపాతాళంలోకి దిగ‌జారుతున్నారని, తాడేప‌ల్లిలోని నీ ఇంటి నుంచి మా ఇల్లు ఎంత దూర‌ముంటుందో, మా ఇంటి నుంచి నీ ఇల్లు కూడా అంతే దూరమనే విషయం తెలుసుకునే రోజు త్వరలోనే రాబోతోంద‌ని హెచ్చ‌రించారు. జగన్ రెడ్డి గాలి హామీలు ఒట్టివేన‌ని తేలిపోయాయని. ఒకప్పటి ఆయన ముద్దులే ఇప్పుడు పిడిగుద్దుల్లా ప‌డుతున్నాయన్నారు. జ‌గ‌న్‌ది అంతా నాట‌కమ‌నే విషయం ప్ర‌జ‌ల‌కు తెలిసిపోయిందని, తమ పరిస్థితిపై ఉలిక్కిప‌డి ప్ర‌తిప‌క్షంపైకి గూండాల‌ను రౌడీలను పంపుతున్నారన్నారు. జగన్ లాంటి క్రూర‌, నేర‌స్వ‌భావం చంద్ర‌బాబుకు లేద‌ని, త్వరలోనే ఒక్కొక్కరికి  వడ్డీతో సహా చెల్లించ‌డం ఖాయ‌మ‌ని నారా లోకేష్ హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: