మోదీకి రఘురామ లేఖ
ప్రధానమంత్రి నరేంద్రమోడీకి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక అవకతవకలను ఆ లేఖలో వివరించారు. నిబంధనలను అధిగమించి మరీ అప్పులిస్తున్నబ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవాలని రఘురామ కోరారు. రాష్ట్ర ఆర్థికశాఖలోని అధికారులు, బ్యాంకు అధికారులు కుమ్మక్కై అప్పులివ్వడమనేది దారుణమని, దీనిపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలన్నారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందనే విషయం దేశం మొత్తం తెలుసని, కొత్తగా అప్పు పుట్టినా అవి పాతవాటికి వడ్డీకింద సరిపోతున్నాయని, వాటినే అప్పు ఇచ్చిన బ్యాంకులు మినహాయించుకుంటున్నాయని రఘురామ వివరించారు. రిజర్వుబ్యాంకు వద్ద సెక్యూరిటీలు వేలం వేయగా వచ్చిన రెండువేల కోట్లరూపాయలను ఓడీ అప్పు కింద జమ చేసుకుందనే విషయాన్ని గమనించాలన్నారు. ఇంతటి దుస్థితి ఉన్నా ఈ ప్రభుత్వం ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించడంలేదని, రోజురోజుకూ తన దిగజారుడు చర్యలతో రాష్ట్రాన్ని, ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్రం జోక్యం చేసుకొని ఏపీలోని పరిస్థితిని అర్థం చేసుకోవాలని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.