కని "కరోనా": కోర్టును చుట్టేసిన మహమ్మారి
గుంటూరు జిల్లా కోర్టును కరోనా చుట్టుముట్టేసింది. కోర్టులో పనిచేస్తోన్న న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది మొత్తం 12 మందికి వైరస్ సోకింది. కోర్టు అసిస్టెంట్ నాజర్‌గా పనిచేస్తోన్న రవి కరోనా సోకడంతో చికిత్స తీసుకుంటూ బుధవారం ఉదయం మృతిచెందారు. ముగ్గురు న్యాయమూర్తులు, ఇద్దరు బార్ కౌన్సిల్ సిబ్బంది, న్యాయశాఖకు చెందిన సిబ్బంది నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్స తీసుకుంటున్నారు. ఒకేసారి ఇంతమందికి కరోనా సోకడంతో జిల్లా కోర్టులో కలకలం రేగింది. ఇప్పటికే రోజువారీ కేసుల నమోదులో గుంటూరు జిల్లా ప్రతిరోజు రెండు, మూడు స్థానాల్లో నిలుస్తోంది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు స్వచ్ఛందంగా తమ వ్యాపారాలను ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకే కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం కూడా అధికారికంగా కర్ఫ్యూను ప్రకటించే అవకాశం కనపడుతోంది. ఆదివారం నుంచి రాత్రి ఏడుగంటల నుంచి ఉదయం ఆరుగంటల వరకు కర్ఫ్యూ విధించొచ్చని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి.